దాదాపు పదేళ్ల తరువాత సిల్వర్ స్క్రీన్ పై భార్యాభర్తలుగా కనిపించబోతున్నారు బాలీవుడ్ జంట కాజోల్, అజయ్ దేవగన్ లు. వీరిద్దరూ కలిసి నటించిన 'తాన్హాజీ' సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ కాజోల్.. తన ప్రేమ కథ, పెళ్లి వంటి విషయాలను చెప్పుకొచ్చింది.

అజయ్ తో నాలుగేళ్లపాటు ప్రేమలో ఉన్నానని.. ఒకరినొకరు పూర్తిగా అర్ధం చేసుకున్న తరువాతే పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చింది. పెళ్లి రోజునాడు.. అగ్నిహోత్రం చుట్టూ తిరిగేటప్పుడు తన భర్త అజయ్.. పూజారిని వేగంగా తంతు పూర్తి చేయాలంటూ లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన విషయాన్ని కాజోల్ బయటపెట్టింది.

'అల.. వైకుంఠపురములో' ఈవెంట్.. నిర్వాహకులపై క్రిమినల్ కేసు

హనీమూన్ లో ఫుల్ గా ఎంజాయ్ చేయాలనుకుంటే తన భర్త ఆరోగ్యం పాడైందని.. దీంతో హనీమూన్ నుండి తిరిగి వచ్చేశామని అప్పటి విషయాలు గుర్తు చేసుకుంది. పెళ్లైన వెంటనే పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నామని.. అయితే వరుసగా అబార్షన్లు కావడంతో తీవ్ర వేదనకి గురయ్యామని కాజోల్ తెలిపింది.

కొన్నాళ్ల తరువాత నైసా జన్మించిందని.. ఆ తరువాత యుగ్ కూడా రావడంతో తమ కుటుంబం పరిపూర్ణమైందని చెప్పుకొచ్చింది. ఆ తరువాత అజయ్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడని.. అజయ్ తో జీవితం తృప్తిగా ఉందని చెప్పుకొచ్చింది.