తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ డైరెక్టర్, కళాతపస్వి కే. విశ్వనాథ్ ఇకలేరు. ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
K Viswanath Passed Away: తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకులు, కళాతపస్వి కె. విశ్వనాథ్ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం కె. విశ్వనాథ్ వయసు 92 ఏళ్ళు. గత కొద్దీరోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య సమస్య తీవ్ర కావడంతో నగరంలోని ప్రముఖ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. కొద్దిసేపటి క్రితం ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.
ఆయన పూర్తి పేరు కాశినాథుని విశ్వనాథ్. ఆయన 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. కానీ.. సినిమాలపై అభిమానంతో చిత్రసీమలో అడుగుపెట్టారు. ఆయన వాహిని స్టూడియోస్‌లో సౌండ్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. 1965లో దర్శకుడిగా మారి ఆత్మగౌరవం సినిమాను తెరకెక్కించారు.
ఆ తరువాత ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం వంటి ఎన్నో క్లాసికల్ హిట్ మూవీస్ ను ప్రేక్షకులకు అందించారు. ఆయన కేవలం డైరెక్టర్ గానే కాకుండా.. నటుడిగా కూడా తన సత్తా చాటుకున్నారు. తొలిసారి శుభసంకల్పం సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన ఆయన ..వజ్రం, కలిసుందాంరా, నరసింహనాయుడు, సీమసింహం, నువ్వులేకనీను లేను, సంతోషం, లాహిరి లాహిరి లాహిరిలో, ఠాగూర్ వంటి పలు చిత్రాల్లో తన నటనతో మెప్పించారు.
