యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమాలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మల్టీ స్టారర్ సినిమాలో రామ్ చరణ్‌ మరో హీరోగా నటిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2021 జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా నిర్మాణానంతర కార్యక్రమాలు జరగకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను జనవరిలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌.

అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్‌లో పెట్టాడు ఎన్టీఆర్‌. నెక్ట్స్ సినిమాను త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించాడు తారక్. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు అయినను పోయి రావలే హస్తినకు అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు  సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు త్రివిక్రమ్‌. అందుకే కాస్టింగ్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాలో విలన్‌గా బాలీవుడ్‌ స్టార్ హీరో సంజయ్‌ దత్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. జాతీయ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంజయ్‌ ఓ జాతీయ స్థాయి పొలిటీషియన్‌గా నటించనున్నాడట.

హీరోయిన్‌ల విషయంలో అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు త్రివిక్రమ్. ఇద్దరు హీరోయిన్లు నటించే ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా బాలీవుడ్‌ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటించనుందట. మరో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. హారికా హాసిని క్రియేషన్స్‌ పాటు ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను 2021 సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.