టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మిడియాలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇన్స్టాగ్రామ్ - ట్విట్టర్ అని తేడా లేకుండా అన్నిట్లో ఒకేసారి అడుగుపెట్టిన మెగాస్టార్ తన అభిప్రాయాల్ని ఇక నుంచి నేరుగా అభిమానులతో పంచుకునేందుకు సిద్ధమని  వీడియో ద్వారా సందేశాన్ని ఇచ్చారు. ఇక మొదటగా ట్విట్టర్ లో మెగాస్టార్ RRR సినిమా గురించి ఒక స్పెషల్ ట్వీట్ చేశారు.

మెగాస్టార్ ట్వీట్ కి మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ సైతం మర్యాదపూర్వకంగా రిప్లై ఇచ్చారు. రీసెంట్ గా RRR చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించిన స్పెషల్ టైటిల్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో లింక్ ని షేర్ చేస్తూ మెగాస్టార్ చిత్ర యూనిట్ ని అభినందించారు. తారక్ రామ్ చరణ్ అద్భుతంగా ఉన్నారని మోషన్ పోస్టర్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నట్లు రాజమౌళి, కీరవాణి పనితనాన్ని కొనియాడారు.

మెగాస్టార్ చేసిన ట్వీట్ కి ఎన్టీఆర్ కూడా రిప్లై ఇచ్చారు. 'మీ మాటలకు చాలా ధన్యవాదాలు సర్. ఇది మాకు చాలా ప్రాధాన్యమైంది. ట్విట్టర్ ప్రపంచంలోకి స్వాగతం' అంటూ ఎన్టిఆర్ స్వీట్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వారు చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక RRR సినిమాను దర్శకుడు రాజమౌళి జనవరి 8న రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ భాషల్లో భారీగా రిలీజ్ కానుంది.