కరోనా కారణంగా ఖాళీగా ఉన్న సెలబ్రిటీలు రకరకాల చాలెంజ్‌లను తెర మీదకు తీసుకువస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్లు టీషర్ట్ చాలెంజ్‌తో హడావిడి చేస్తుండగా తాజాగా హీరోలు దర్శకులు బీ ద రియల్‌ మ్యాన్‌ అనే చాలెంజ్‌ను కొనసాగిస్తున్నారు. ముందుగా అర్జున్‌ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ఈ చాలెంజ్‌ను తెర మీదకు తీసుకు వచ్చాడు. తాను ఇంటి పనులు చేస్తూ వీడియో తీసి ఆ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశాడు. అంతేకాదు మరింత మంది ఈ చాలెంజ్‌ చేరేలా చేయాలంటూ ఆయన దర్శకుడు రాజమౌళిని కోరాడు.

అయితే చాలెంజ్‌ స్వీకరించిన దర్శకుడు రాజమౌళి, తాను కూడా ఇంటి పనులు చేస్తూ వీడియోను పోస్ట్ చేసి, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, కీరవాణి, నిర్మాత శోభు, దర్శకుడు సుకుమార్లను చాలెంజ్‌ చేశాడు. ఆ చాలెంజ్‌ను వెంటనే స్వీకరించిన ఎన్టీఆర్‌ ఈ రోజు ఉదయం తాను ఇంటి పనులు చేస్తున్న వీడియోను షేర్‌ చేశాడు. అంతేకాదు చాలెంజ్‌ను మరింతగా కొనసాగిస్తూ మరికొంత మందికి చాలెంజ్‌ విసిరాడు.

ఎన్టీఆర్‌.. బాబాయ్‌ బాలకృష్ణతో పాటు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌, కింగ్ నాగార్జునలను చాలెంజ్‌ చేశాడు. వీరితో పాటు దర్శకుడు కొరటాల శివలను చాలెంజ్‌ చేశాడు. `మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలను మాత్రమే కాదు, పనులు కూడా పంచుకుందాం` అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్‌. మరి చాలెంజ్‌లో ముందు ముందు ఎంత మంది బాగస్వాములవుతారో చూడాలి.