ఈ రోజు ఉదయం నుంచి మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ అప్‌డేట్ వచ్చేసింది. మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించి ఓ సర్‌ప్రైజ్‌ ఇస్తానంటూ జూనియర్‌ ఎన్టీఆర్‌ నిన్నే ప్రకటించాడు. కానీ ఈ రోజు ఉదయం రాజమౌళి వల్ల సర్‌ప్రైజ్‌ ఆలస్యమవుతుందంటూ ట్వీట్ చేసి ఆ నిరీక్షణను మరింత పొడిగించాడు. అయితే ఫైనల్‌గా సాయత్రం నాలుగు గంటలకు ఆ సర్‌ ప్రైజ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

ముందునుంచి అనుకుంటున్నట్టుగా సినిమాలో రామ్‌ చరణ్‌ లుక్‌ ను రివీల్ చేశాడు ఎన్టీఆర్‌. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నాడు రామ్ చరణ్‌. అయితే క్యారెక్టర్లను డిజైన్‌ చేయటంలో రాజమౌళి స్టైలే వేరు. అందుకే ఈ సినిమాలో చరణ్‌ లుక్ ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అదే స్థాయిలో అంచనాలు కూడా పెంచుకున్నారు. ఆ అంచనాలన్నీ మించే స్థాయిలో ఉంది చరణ్‌ లుక్‌. రామ్‌ చరణ్ వర్క్ అవుట్ వీడియో దానికి తెలంగాణ యాసలో ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్స్, గ్రాఫిక్స్‌, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ వావ్ అనిపించేలా ఉన్నాయి.

రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌ లు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ తెలంగాణ సాయుథ పోరాట యోధుడు కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు. బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి. ఎన్టీఆర్‌, చరణ్ లాంటి ఇద్దరు టాప్ హీరోలు కలిసి నటిస్తుండటం, దాదాపు 400 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న పీరియాడిక్ సినిమా కావటంతో.., ఈ సినిమా కూడా జాతీయ స్థాయిలో సత్తా చాటడం ఖాయం అని భావిస్తున్నారు.

ఇక ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎన్టీఆర్‌కు జోడిగా హాలీవుడ్‌ భామ ఒలివియా మోరీస్‌ నటిస్తోంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్‌, తమిళ విలక్షణ నటుడు సముద్రఖనిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విలన్స్‌ గా ప్రఖ్యాత హాలీవుడ్‌ స్టార్స్ కనిపించనున్నారు. ఈ సినిమాను 2021 జనవరి 8న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు రాజమౌళి.