ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్ మూవీ మేనియానే కనిపిస్తుంది. మార్చి 25న భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రం కోసం ప్రపంచ దేశాల తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ అయిపోయింది.
ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. ఇక ఈ చిత్రం మరి రెండు రోజుల్లో అంటే మార్చి 25న రిలీజ్‌కానున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.ఈ నేపధ్యంలో 'ఆర్‌ఆర్‌ఆర్' రిలీజ్ థియేటర్ల వద్ద జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల సందడి కనిపిస్తోంది. థియేటర్ల ముందు భారీ ఎత్తున పోస్టర్లు ఏర్పాట్లు చేసే పనుల్లో తారక్, చరణ్ అభిమానులంతా బిజీ బిజీగా ఉన్నారు. అయితే అక్కడక్కడా చిన్న చిన్న వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.
తాజాగా కోదాడలోని ఓ పముఖ థియేటర్ వద్ద తారక్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసే విషయంలో ఇరు అభిమానుల మధ్య పరస్పరం ఘర్షణ తలెత్తినట్టు సమాచారం. ఇక దాంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఒకరు ఏకంగా పెట్రోల్ మీద పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ అభిమాని ఆత్మహత్యాయత్యానికి ఒడిగట్టడం చూసిన స్థానికులు, తోటి అభిమానులు అతడిని వారించి అడ్డుకున్నట్టు సమచాారం. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన థియేటర్ వద్దకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం ఘర్షణకు కారణమైన వ్యక్తులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించినట్టు పోలీసులు తెలిపారు. దీంతో సదరు థియేటర్ వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
మరో ప్రక్క తొలిసారిగా భారతీయ సినీ ప్రేక్షకులకు ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ఎన్‌ఎఫ్‌టీ(నాన్ ఫంజిబుల్ టోకెన్స్) కలెక్షన్లను గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పీవీఆర్ ప్రకటించింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్, పీవీఆర్ సంయుక్తంగా ఈ డిజిటల్ ఎన్‌ఎఫ్‌టీలను ప్రేక్షకులకు అందుబాటులో ఉంచనుంది. ఎస్‌ఎస్ రాజమాళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, అలియా భట్ సంతకం చేసిన పోస్టర్లు, సినిమాలో వాడిన పలు వస్తువులతో సహా దాదాపు 300పైగా ఎన్‌ఎఫ్‌టీలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ డిజిటల్ కలెక్షన్లను పీవీఆర్ నిర్వహించే పోటిలో వీటిని ప్రేక్షకులు సొంతం చేసుకోవచ్చునని పీవీఆర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా పాత చిత్రాలను కూడా ఎన్‌ఎఫ్‌టీ కలెక్షన్ల రూపంలో అందించేందుకు సిద్దమని పీవీఆర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజిలీ చెప్పారు.
