Asianet News TeluguAsianet News Telugu

జయప్రకాశ్ రెడ్డి మరణం: ఆయన తీరని కోరిక తెలుసా.....

చిన్ననాటి నుండి కూడా నాటకాలంటే జేపీ కి అమితమైన ఇష్టం. అదే వ్యాపకంగా కూడా ఉండేది. జేపీ  నాన్నగారు కూడా రంగస్థలం మీద నటించినవారే. 

Jayaprakash reddy dies: His Unfulfilled Desire
Author
Hyderabad, First Published Sep 8, 2020, 10:07 AM IST

రాయలసీమ యాసలో మాట్లాడుతూ... కామెడీ టచ్ ఉన్న విలన్ గా తెలుగువారి మన్ననలు పొందిన జయప్రకాశ్ రెడ్డి మరణించారు. ఆయన మరణ వార్త విని సినీ లోకం దిగ్భ్రాంతికి గురయ్యింది. సినీ అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. 

ఈ విలక్షణ నటుడు సినిమాల్లోకి వచ్చే ముందు ఉపాధ్యాయుడిగా పని చేస్తుండేవాడు. చిన్ననాటి నుండి కూడా నాటకాలంటే జేపీ కి అమితమైన ఇష్టం. అదే వ్యాపకంగా కూడా ఉండేది. జేపీ  నాన్నగారు కూడా రంగస్థలం మీద నటించినవారే. 

జయప్రకాశ్ రెడ్డి తండ్రిగారు పోలీస్ డిపార్టుమెంటు లో సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయిలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన జయప్రకాశ్ రెడ్డి గారికి ఎప్పుడు వెన్నంటి నిలిచి ప్రోత్సహించేవారు. 

జయప్రకాశ్ రెడ్డి గారికి, ఆయన తమ్ముడికి ఇద్దరికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. జేపీ కి ఏకంగా అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ గా, ఫారెస్ట్ డిపార్టుమెంటు లో కూడా ఉద్యోగాలొచ్చాయి. గెజిటెడ్ ఉద్యోగాలయినప్పటికీ..., వారి తండ్రి మాత్రం అందులో చేరడానికి ససేమిరా ఒప్పుకోలేదు. 

కేవలం జేపికే కాదు, ఆయన తమ్ముడికి కూడా బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చింది. అతడిని కూడా ఆ ఉద్యోగంలో చేరనివ్వలేదు. అందుకు కారణం కూడా లేకపోలేదు. జేపీ తండ్రి ఆదర్శ భావాలూ కలిగిన వ్యక్తి. చేసేది పోలీస్ ఉద్యోగమే అయినా ప్రతి రోజు సైకిల్ మీదనే డ్యూటీకి వెళ్ళేవాడు. 

పెద్దల ఆస్తిలో 90 శాతం మేర దానధర్మాలకే వెచ్చించాడు. తన కొడుకులు ఎవరు కూడా లంచాలు తీసుకునే ఉద్యోగాలు చేయకూడదని జేపీ గారి తండ్రి కొడుకులను ఉద్యోగాల్లో చేరనివ్వలేదన్నమాట. ఆయన తండ్రిగారి ఆదర్శ భావాలను పుణికి పుచ్చుకొని సినిమాల్లోకి రాకముందు జయప్రకాశ్ గారు టీచర్ గా పనిచేసేవారు. 

జయ ప్రకాష్ గారి తండ్రిగారు జయప్ర్రకాష్ గారిని నాటకాల వైపుగా ప్రోత్సహించారు. తండ్రి తనయులు కలిసి సైతం ఒకే నాటకంలో కనిపించారు కూడా. తండ్రి కట్టబ్రహ్మణగా ఇంగ్లీష్ అధికారిగా జేపీ వేసిన నాటకం ఆ రోజుల్లో పెద్ద హిట్. 

అలా సినిమాల్లోకి రావడానికి జేపీ ని వెన్నుతట్టి ప్రోత్సహించిన అతని తండ్రి... జేపీ పూర్తి స్థాయి సక్సెస్ ని చూడకుండానే కనుమూశారు. తండ్రి మరణంతో ఒక తీరని కోరిక మిగిలిపోయిందని జేపీ ఎప్పుడు బాధపడుతుండేవారు. తన సొంత  తండ్రిని కూర్చోబెట్టుకొని తిప్పలేకపోయానే అనే బాధ తనని కలిచివేస్తుందని, అది ఒక్కటే తీరని కోరిక అని జేపీ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios