యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. 

ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ చిత్రం కోసం కథ రెడీ చేస్తున్నాడు. అరవింద సమేత లాంటి సూపర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో మరో చిత్రం వస్తుంటే సహజంగానే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. త్రివిక్రమ్ కూడా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలోనే తెరకెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. 

ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రపై క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ కి జోడిగా ఈ చిత్రంలో జాన్వీ కపూర్ అయితే బావుంటుందని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు టాక్. త్రివిక్రమ్ కూడా ఫోన్ లో జాన్వికి ఎన్టీఆర్ మూవీ గురించి వివరించాడట. అతిలోక సుందరి కుమార్తె ఈ చిత్రంపై ఆసక్తిగానే ఉన్నప్పటికీ బాలీవుడ్ లో తనకున్న కమిట్మెంట్స్ దృష్ట్యా డేట్స్ కుదిరితే నటించడానికి సిద్దమే అని అంటోందట. 

చాలా కాలంగా జాన్వీ కపూర్ తెలుగు డెబ్యూ మూవీ గురించి మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. హారిక అండ్ హాసిని సంస్థ, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.