ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు డేనియల్ క్రేగ్ నటిస్తున్న జేమ్స్ బాండ్ సిరీస్ దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సిరీస్ లో 25వ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి చాలా రోజుల క్రితమే 'నో టైమ్ టు డై' అనే టైటిల్ ఖరారు చేశారు. ఆ మధ్యన టీజర్ కూడా విడుదల చేశారు. 

తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది.  నో టైమ్ టు డై ట్రైలర్ సినిమాపై అమాంతం అంచనాలు పెంచే విధంగా ఉందని చెప్పడంలో సందేహం లేదు. జేమ్స్ బాండ్ చిత్రాల్లో సాగే మైండ్ గేమ్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులని అలరిస్తుంటాయి. ఈ చిత్రం యాక్షన్ సన్నివేశాలు మరింత ఉత్కంఠ భరితంగా ఉండబోతున్నాయి. 

ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న ఆస్కార్ విజేత రామి మాలిక్ భయంకరంగా కనిపిస్తున్నాడు. డేనియల్ క్రేజ్ ట్రైలర్ లో చాలా స్టైలిష్ గా, యాక్షన్ సన్నివేశాల్లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. 

ఈ చిత్రంలో సీఐఏ సంస్థ డేనియల్ కు ఓ శాస్త్రవేత్తని రక్షించే మిషన్ అప్పగిస్తుంది. కానీ డేనియల్ మిషన్ కు విలన్స్ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తుంటారు. పవర్ ఫుల్ వెపన్స్, ఛేజింగ్ సన్నివేశాలు ట్రైలర్ లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్ర చిత్రీకరణ సమయంలో డేనియల్ క్రేగ్ యాక్షన్ స్టంట్స్ చేస్తూ పలుమార్లు గాయపడ్డాడు. క్యారీ జోజి ఈ చిత్రానికి దర్శకుడు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.