రకరకాల గెటప్స్ వేస్తూ 'జబర్దస్త్' కామెడీ షోలో కమెడియన్ గా చక్కటి గుర్తింపు తెచ్చుకున్నాడు గెటప్ శ్రీను. బుల్లితెరపై మాత్రమే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా తన సత్తా చాటుతుంటాడు. తాజాగా ఈ నటుడు సోషల్ మీడియాలో తన అభిమానులతో కాసేపు ముచ్చటించాడు. ఈ క్రమంలో వారు అడిగిన ఎన్నో ప్రశ్నలను సమాధానాలు ఇచ్చాడు.

బిగ్ బాస్ షోపై మీ అభిప్రాయమేంటని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. షో ప్రేక్షకులను బాగా అలరిస్తుందని.. మొదట్లో తనను కూడా షో కోసం సంప్రదించారని చెప్పాడు. అయితే అందులో ఉండిపోతే వేరే షోలు చేయడానికి ఉండదని.. అందుకే బిగ్ బాస్ చేయడానికి అంగీకరించలేదని.. ఒకవేళ ఒప్పుకున్నా.. మొదటివారంలోనే బయటకి వచ్చేస్తానని అన్నారు.

 

'జబర్దస్త్' షోకి లీడర్ గా ఎందుకు చేయడం లేదో చెప్పుకొచ్చాడు గెటప్ శ్రీను. 'జబర్దస్త్', 'ఎక్స్ ట్రా జబర్దస్త్' షోలను ఒకరోజు గ్యాప్ తో షూట్ చేస్తారని.. అప్పట్లో 'జబర్దస్త్' టీమ్ లీడర్ గా ఉండడంతో.. ఆ తరువాత రోజు జరిగే 'ఎక్స్ ట్రా జబర్దస్త్' లో నటించడం కష్టమయ్యేదని చెప్పారు. నాలుగు కంటెంట్ లు ఆలోచిస్తే.. రామ్ ప్రసాద్ స్క్రిప్ట్ రాయడం, ఇద్దరం నటించడం చేయాలని.. క్వాలిటీ కంటెంట్ వచ్చేది కాదని.. దీంతో టీమ్ లీడర్ గా చేయనని చెప్పేశానని క్లారిటీ ఇచ్చారు.

మరో నెటిజన్.. సుధీర్, రష్మి మ్యారేజ్ ఎప్పుడని అడగగా.. వారిద్దరూ పెళ్లి చేసుకోరని చెప్పాడు. ఇద్దరివీ వేర్వేరు జీవితాలని. షూటింగ్ అయిపోగానే ఎవరి లోకం వాళ్లదని, ప్రేక్షకులను అలరించడానికి ఒక కాంబినేషన్.. అలా చూపిస్తారు కానీ అది నిజం కాదని.. సుధీర్ కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటాడని అన్నారు. శుక్రవారం నాడు విడుదలైన 'రాజు గారి గది 3'లో గెటప్ శ్రీను ఓ పాత్ర పోషించాడు. 'జబర్దస్త్' షోలో బాగా ఫేమస్ అయిన బిల్డప్ బాబాయ్ పాత్ర రాజుగారి గదిలో ఉంటుందని చెప్పాడు.