కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ఆదివారం రోజు గ్రాండ్ ఫినాలేకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ లో విజేతగా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ ఫైనల్స్ కు చేరారు. 

అలీ ఎలిమినేట్ అయిన తర్వాత వైల్డ్ కార్డు ద్వారా వచ్చాడు కాబట్టి అతడిపై అంచనాలు లేవు. కానీ సోషల్ మీడియాలో అభిమానుల హోరు చూస్తుంటే.. శ్రీముఖి, రాహుల్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరికి బాబా భాస్కర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. వరుణ్ సందేశ్ కు ఒక సెక్షన్ నుంచి భారీగా ఓట్లు పడుతున్నా శ్రీముఖి, రాహుల్ స్థాయిని అందుకోలేకపోతున్నట్లు టాక్. 

మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖినే విజేతగా నిలబెట్టాలని ఆమె అభిమానులు హోరెత్తిస్తున్నారు. శ్రీముఖి సోషల్ మీడియా టీం కూడా జోరుగా ప్రచారం చేస్తోంది. శుక్రవారం అర్థ రాత్రితో ఓటింగ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వైరల్ పిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

శ్రీముఖి బిగ్ బాస్ టైటిల్ గెలిచేసినట్లు, ఆమె టైటిల్ అందుకుని నాగార్జునని కౌగిలించుకున్నట్లు ఉన్న ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నిజంగా శ్రీముఖి బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిందా లేక ఇది మార్ఫింగ్ ఫోటోనా అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. 

బిగ్ బాస్ వేదిక నుంచి ఫోటో అంత సులువుగా లీక్ కాదు. ఇది తప్పకుండా మార్పింగ్ ఫోటోనే అని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. శ్రీముఖి అభిమానులు ఈ ఫోటో క్రియేట్ చేసి ఉంటారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలా మార్పింగ్ ఫోటో వల్ల.. ఆల్రెడీ శ్రీముఖి గెలిచేసింది కాబట్టి మిగిలిన వారికి ఓటింగ్ చేసి వృధా అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అందుకోసమే ఆమె అభిమానులు ఈ ఫోటోని వైరల్ చేసి ఉంటారనే ప్రేక్షలులు అభిప్రాయ పడుతున్నారు. 

మరికొందరు శ్రీముఖి అభిమానులు ఇదే నిజం అయితే బావుంటుంది అని కామెంట్స్ పెడుతున్నారు.