బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌ వరకు ఎన్నో సినిమాల్లో నటించిన విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ బుధవారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బాల్య మిత్రుడు హైదర్‌ అలీ జైదీ స్పందించారు. ప్రస్తుతం ఆయన భరత్‌ పూర్‌ ఎస్పీ గా సేవలందిస్తున్నారు. ఇర్పాన్ మరణ వార్త తెలిసిన ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు.

ఇర్ఫాన్ గొప్ప వ్యక్తి అని చెప్పిన జైదీ ఇప్పటి వరకు తన ఫోన్‌ కోసం ఎదురుచూస్తున్నా అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ విషాదాన్ని తట్టుకోగలిగే శక్తి ఆయన కుటుంబానికి కలగాలని ఆయన దేవుడ్ని ప్రార్ధించారు. ఈ సందర్భంగా ఇర్ఫాన్‌ చిన్నతనానికి సంబంధించిన ఓ విషయాన్ని పంచుకున్నారు జైదీ. ఇర్ఫాన్‌ ఉపాద్యాయుడు కావాలని ఆయన తల్లి కోరుకునేదని జైదీ తెలిపాడు.

అరుదైన క్యాన్సర్ బారిన పడిన ఇర్ఫాన్‌ ఖాన్ విదేశాల్లో చికిత్స పొందారు. పూర్తిగా కోలుకొని ఇండియాకు తిరిగి వచ్చిన ఆయన తిరిగి సినిమాల్లో నటిస్తాడనుకుంటున్న తరుణంలోనే లాక్ డన్‌ కారణంగా షూటింగ్ లు ఆగిపోవటంతో ఇంటికే పరిమితమయ్యారు. ఆ సమయంలో క్యాన్సర్‌ తిరగబెట్టడంతో ఆయన మృతి చెందినట్టుగా సన్నిహితులు వెల్లడించారు. ఈ నెల 25న ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీదా బేగం (95) జైపూర్‌లో కన్నుమూశారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఇర్ఫాన్ చివరి చూపుకు కూడా వెళ్లలేకపోయారు