క్రీడాకారులు సినిమా రంగంలోకి రావడం చాలా రోజుల నుంచి జరుగుతోంది. అజయ్ జడేజా, శ్రీశాంత్ లాంటి క్రికెటర్లు ఇప్పటికే సినిమాల్లో నటించారు. వారి బాటలోనే మరో క్రికెటర్ పయనిస్తున్నాడు. తాన్ స్వింగ్ మాయాజాలంతో బ్యాట్స్ మెన్ ని బోల్తా కొట్టించిన ఇర్ఫాన్ పఠాన్ నటుడిగా మారాడు. 

స్టార్ హీరో చియాన్ విక్రమ్ 58వ చిత్రంలోపఠాన్ నటిస్తున్నాడు. గతంలోనే ఈ విషయాన్ని పఠాన్ వివరించాడు. క్రికెట్ కు పఠాన్ కొంత కాలంగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీనితో నటుడిగా టర్న్ తీసుకున్నాడు. 

పఠాన్ రీసెంట్ గా ఓ టివి షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన నటనా అనుభవాన్ని వివరించాడు. విక్రమ్ 58వ చిత్రంలో తన రోల్ ఏంటో కూడా వివరించాడు. ఈ చిత్రంలో పఠాన్ పాత్రకు సంబందించిన షూటింగ్ ముగిసింది. 

ఈ చిత్రంలో తానూ టర్కీ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు పఠాన్ తెలిపాడు. నేను గతంలో రియాలిటీ షోలు చేశాను. కానీ నటన భిన్నమైనది. నటించాలంటే చాలా అనుభవం కావాలి.. అదే విధంగా ఓపిక కూడా ఉండాలి. 

ఈ చిత్రంలో నాకు విక్రమ్ కి మధ్య కొన్ని సన్నివేశాలు ఉన్నాయి.విక్రమ్ తో కలసి నటించడం నాకు ఓ గొప్ప అనుభూతి. విక్రమ్ ని అంతా సౌత్ ఇండియా అమిర్ ఖాన్ అని ఎందుకు అంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. విక్రమ్ అద్భుతమైన నటుడు అని పఠాన్ ప్రశంసించాడు. 

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ చిత్రాన్ని డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కిస్తున్నారు. లలిత్ కుమార్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు.