కెరీర్ ఆరంభంలో వరుణ్ తేజ్ కు కలసి రాలేదు. వరుణ్ నటించిన ముకుంద, కంచె చిత్రాలు నిరాశపరుస్తూ వచ్చాయి. శేఖర్ కమ్ముల దర్శత్వంలో తెరకెక్కిన ఫిదా చిత్రంతో వరుణ్ తేజ్ ఫస్ట్ హిట్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత తొలి ప్రేమ, ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ చిత్రాలు విజయం సాధించడంతో వరుణ్ తేజ్ మార్కెట్ పెరిగింది. 

ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో ఓ చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. డెబ్యూ దర్శకుడు కిరణ్ కొర్రపాటి చెప్పిన కథ నచ్చడంతో వరుణ్ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రం కోసం వరుణ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 

దర్శకుడు కిరణ్ కొర్రపాటి ప్రస్తుతం నటీనటుల్ని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ వరుణ్ తేజ్ తల్లిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె పాత్ర గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. 

రొమాంటిక్ హీరో మాధవన్, రమ్యకృష్ణ ఈ చిత్రంలో వరుణ్ తేజ్ తల్లి దండ్రులుగా నటించబోతున్నట్లు టాక్. ఇది నిజంగా క్రేజీ కాంబినేషనే అని చెప్పొచ్చు. రమ్యకృష్ణ భార్యగా నటించేందుకు మాధవన్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. 

శివగామి లాంటి అద్భుతమైన పాత్రలతో దూసుకుపోతున్న రమ్యకృష్ణకు తల్లిగా నటించడం కొత్తేమీ కాదు. కానీ మాధవన్ వరుణ్ తేజ్ తండ్రిగా అంటే కాస్త ఆశ్చర్యకరంగానే ఉంటుంది. రమ్యకృష్ణ, మాధవన్ వయసు దాదాపుగా సమానం. కానీ మాధవన్ ని అభిమానులు ఇప్పటికి హీరోగానే చూస్తారు. మరి రమ్యకృష్ణ భార్యగా, వరుణ్ తండ్రిగా మాధవన్ ఎలా నటిస్తాడో వేచి చూడాలి. 

రమ్యకృష్ణ, మాధవన్ పాత్రలపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ లో అల్లు బాబీ ఈ మూవీని నిర్మిస్తున్నారు.