మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం కావడంతో దేశం మొత్తం సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ కోసం ఎదురుచూస్తున్నారు. 

రాజమౌళి సినిమాలో నటించిన తర్వాత ఎలాంటి చిత్రం చేయాలనే డైలమా సహజంగానే హీరోలకు ఉంటుంది. గతంలో మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రాంచరణ్ ఆరెంజ్ చిత్రంలో నటించి దెబ్బతిన్నాడు. అలాంటి పొరపాట్లు ఈసారి రిపీట్ కాకూడదని భావిస్తున్నాడు. 

ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ చేయబోయే సినిమా విషయంలో మెగాస్టార్ చిరంజీవి కొన్ని సూచనలు చేశారట. దర్శకుడు అనిల్ రావిపూడికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చిరంజీవి సూచించినట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి కమర్షియల్ ఎంటర్టైనింగ్ చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ మంచి కథతో వస్తే అతడికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చిరు రాంచరణ్ కు సూచించినట్లు తెలుస్తోంది. 

ఇవేమి కుదరకపోతే ఒక మంచి తమిళ చిత్రాన్ని ఎంచుకుని తెలుగులో ఒరిజినల్ దర్శకుడితోనే రీమేక్ చేయాలని చెప్పాడట. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రలో నటిస్తున్నాడు. రాంచరణ్ కు హీరోయిన్ గా అలియా భట్ నటిస్తోంది. 

డివివి దానయ్య దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.