రానా నటిస్తున్న విరాటపర్వం చిత్రం నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో తెరక్కుతోంది. రానా తన కెరీర్ లో బాహుబలి, ఘాజి, నేనే రాజు నేనే మంత్రి లాంటి విభిన్న చిత్రాలని ఎంచుకున్నాడు. విరాటపర్వం చిత్రం కూడా సాహసోపేతమైన కథే. 1990 కాలానికి సంబంధించిన పరిస్థితులతో వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. 

రానా సరసన ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి ఈ చిత్రంలో నక్సలైట్ పాత్రలో నటిస్తోందట. తాజాగా సాయిపల్లవి పాత్ర గురించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. నక్సలైట్ గా ఒదిగిపోయి నటించేందుకు సాయి పల్లవికి శిక్షణ అవసరం అని దర్శకుడు భావించాడట. 

దీనితో ఓ మాజీ నక్సలైట్ తో ఆమెకు శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలుస్తోంది. అడవుల్లో నక్సలైట్స్ వ్యవహార శైలి ఎలా ఉంటుంది.. ప్రతికూల పరిస్థితుల్లో వారు ఎలా ఉంటారు.. లాంటి విషయాల్లో సాయి పల్లవి శిక్షణ పొందుతున్నట్లు తెలుస్తోంది. 

ఇక ఈ చిత్రంలో రానా పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు టాక్. సినిమా ప్రారంభమైంది కానీ దర్శకుడు ఈ చిత్ర విశేషాల్ని గోప్యంగా ఉంచుతున్నాడు. ఈ చిత్రంలో నందితా దాస్, ఈశ్వరి రావు, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2020లో విరాటపర్వం చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

బాలీవుడ్ సీనియర్ నటి టబు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించాల్సింది. కానీ టబు కొన్ని కారణాల వల్ల విరాటపర్వం నుంచి తప్పుకుంది. మహిళా హక్కుల కోసం పోరాడే వ్యక్తి పాత్రలో టబుని అనుకున్నారు. కానీ ఆమె స్థానంలోకి హిందీతో పాటు వివిధ భాషల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న నందిత దాస్ ని ఎంపిక చేసుకున్నారు. 

మహా భారతంలో విరాటపర్వం అనే అధ్యాయం ఉంటుంది. ఇందులో పాండవులు మారు రూపాల్లో అజ్ఞాతవాసం చేస్తారు. అత్యంత బలశాలురైన పాండవులు అతి తక్కువ స్థాయి స్థానాల్లోకి కుదించుకుపోతారు. అంటే వారి స్థాయికి తగిన స్థానాలు అవి కావు. అదే సమయంలో వారు బయటిప్రపంచానికి కనిపించకుండా అజ్ఞాతవాసం చేస్తుంటారు. విరాటపర్వం అని సినిమా పేరును ఎంచుకోవడం ద్వారా దర్శకుడు ఆ రెండింట్లో దేన్ని సంకేతిస్తున్నాడు, రెండింటినీ సంకేతిస్తున్నాడా అనేది చూడాల్సి ఉంది. రానా తండ్రి సురేష్ బాబు, ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.