దిగ్గజ నటుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు 2 చిత్ర షూటింగ్ లో ఘోరం ప్రమాదం జరిగింది. తమిళనాడులోని పూనమల్లి ప్రాంతంలో భారతీయుడు 2 చిత్రానికి సంబంధించిన భారీ యాక్షన్ సీన్స్ ని దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. 

ఈ నేపథ్యంలో సెట్స్ లో ఉన్న భారీ క్రేన్ విరిగి పడడంతో ఓ అసిస్టెంట్ డైరెక్టర్, ఇద్దరు సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోరంలో డైరెక్టర్ శంకర్ కు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కాలికి తీవ్ర గాయమైనట్లు సమాచారం. ఈ వార్త వినగానే తమిళ చిత్ర పరిశ్రమతో పాటు, సినిమా అభిమానుల్లో విషాదం నెలకొంది. 

భారతీయుడు చిత్రాన్ని మించేలా ఈ సీక్వెల్ ని శంకర్ ప్లాన్ చేశారు. ఆ స్థాయిలో నిర్మాణం జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం విషాదకరం. సెట్స్ లో విరిగిపడిఉన్న క్రేన్ దృశ్యాలు చూస్తుంటేనే అర్థం అవుతోంది ప్రమాద తీవ్రత ఎంత ఉందో అని. 

భారీ యాక్షన్ సీక్వెన్స్ కు అంతా రెడీ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. క్రేన్ భాగాలు విరిగి పడడం వల్ల ముగ్గురు మృతి చెందడంతో పాటు పలువురు గాయపడ్డారు. దర్శకుడు శంకర్ పై భారీ లైట్ పడ్డట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని చిత్ర యూనిట్ వెంటనే ఆసుపత్రికి తరలించింది. 

లైటింగ్ సెటప్ ఏర్పాటు చేస్తుండగా వందలాది టన్నుల బరువున్న క్రేన్ విరగడంతో ఈ ప్రమాదం సంభవించింది. భారతీయుడు 2 చిత్రం శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ లో ఒకటి. దాదాపు పాతికేళ్ల క్రితం శంకర్, కమల్ కాంబోలో తెరకెక్కిన భారతీయుడు చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. మరణించిన వారి కుటుంబాలకు న్యాయం జరగాలని, ఈ ఘోరం నుంచి చిత్ర యూనిట్ త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్క సినీ అభిమాని కోరుకుంటున్నారు.