ఇళయదళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బిగిల్. తెలుగులో విజిల్ గా ఈ చిత్రం విడుదలయింది. దీపావళి కానుకగా విడుదలైన బిగిల్ అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ మధ్యన విజయ్ జోరు మామూలుగా లేదు. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 

ఇదిలా ఉండగా విజయ్ 64వ చిత్రానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. రీసెంట్ గా హీరో కార్తీ ఖైదీ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించబోతున్నాడు. మెర్సల్, సర్కార్, బిగిల్ లాంటి సూపర్ హిట్స్ తర్వాత తెరకెక్కబోతున్న చిత్రం కావడంతో సినిమా ప్రారంభానికి ముందే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 

అందుకు తగ్గట్లుగానే లోకేష్ కనకరాజ్ అదిరిపోయే కథని సిద్ధం చేసినట్లు టాక్. తాజాగా విజయ్ 64వ చిత్ర స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పాయింట్ వైరల్ అవుతోంది. 

ఈ చిత్రంలో విజయ్ కాలేజీ ప్రొఫెసర్ గా కనిపిస్తాడట. విజయ్ కి స్టూడెంట్స్ గా హీరోయిన్ మాళవిక మోహన్, ఆండ్రియా లాంటి హాట్ బ్యూటీలు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కానీ విజయ్ చుట్టూ మాఫియా నేపథ్యం ఉంటుందని టాక్. ఇదే కనుక నిజమైతే మరో పవర్ ఫుల్ రోల్ లో విజయ్ ని చూడొచ్చు. 

విజయ్ నటించిన బిగిల్ చిత్రం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కింది. ఫుట్ బాల్ క్రీడ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. విజయ్ నుంచి వరుసగా సందేశాత్మక చిత్రాలు వస్తున్నాయి.