హాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు జాన్ విథర్ స్పూన్(77) మంగళవారం మృతిచెందారు. లాస్ ఏంజిల్స్ లోని ఆయన నివాసంలోనే తుదిశ్వాస విడిచినట్లు విథర్ స్పూన్ మేనేజర్ అధికారికంగా వెల్లడించారు. 

జాన్ విథర్ స్పూన్ పలు హాలీవుడ్ చిత్రాల్లో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా విథర్ స్పూన్ నటించిన 'ఫ్రైడే' సిరీస్ అతడికి మంచి గుర్తింపు తీసుకుని వచ్చింది. ప్రపంచం మొత్తాన్ని విథర్ తన హాస్యంతో నవ్వించాడు. ఆ చిత్రంలో ప్రముఖ నటుడు ఐస్ క్యూబ్ తండ్రిగా విథర్ పాత్ర ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది. 

బుల్లి తెరపై కూడా విథర్ స్పూన్ నవ్వుల రారాజుగా నిలిచాడు. అనేక టివి షోలలో విథర్ కామెడీ పండించాడు. విథర్ లాంటి గొప్ప హాస్య నటుడి మరణించడంతో హాలీవుడ్ తారలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 

తన తండ్రి మరణించడంతో విథర్ కుమారుడు జేడీ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. నా తండ్రి మరణించారు.. ఈ క్షణంలో ఎలా స్పందించాలో నిజంగా నాకు తెలియడం లేదు. నా తండ్రితో నేను గడిపిన సంతోషకరమైన సందర్భాలన్నీ గుర్తొస్తున్నాయి. 

మాఇద్దరిదీ తండ్రి కొడుకుల బంధం మాత్రమే కాదు.. అంతకు మించి. ఆయన నాకు ఓ స్నేహితుడు కూడా అని జేడీ పేర్కొన్నాడు. ఇక ఆస్కార్ అవార్డు విజేత, నటి రెజీనా కింగ్ విథర్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. విథర్ నా తండ్రితో సమానం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని రెజీనా తన సంతాపాన్ని తెలియజేసింది. వీరిద్దరూ పలు చిత్రాల్లో నటించారు. 

ఇదిలా ఉండగా విథర్ మృతికి స్పష్టమైన కారణాలు తెలియడం లేదు. విథర్ తన నివాసంలోనే హఠాత్తుగా మరణించినట్లు తెలుస్తోంది.