కింగ్ నాగార్జున చివరగా నటించిన చిత్రం మన్మథుడు 2. నాగార్జున క్లాసికల్ హిట్ మన్మథుడు చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. త్వరలో నాగ్ సోగ్గాడే చిన్నినాయనా చిత్ర సీక్వెల్ బంగార్రాజు చిత్రంలో నటించబోతున్నాడు. ఇదిలా ఉండగా నాగార్జున ఓ హిందీ చిత్ర రీమేక్ లో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఏషియన్ సినిమాస్ నిర్మాతలు హిందీలో విజయం సాధించిన రైడ్ మూవీ రీమేక్ ప్రపోజల్ తో నాగార్జునని సంప్రదించారట. గత ఏడాది విడుదలైన రైడ్ చిత్రంలో బాలీవుడ్  స్టార్ అజయ్ దేవగన్, హాట్ బ్యూటీ ఇలియానా జంటగా నటించారు. 

అజయ్ దేవగన్ ఈ చిత్రంలో ఆదాయపుపన్ను శాఖ అధికారిగా నటించారు. నాగార్జున ఈ చిత్రంపై సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే బిగ్ బాస్ పూర్తయిన తర్వాత ఈ క్రేజీ రీమేక్ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

నాగార్జున ఇటీవల నటించిన దేవదాస్, ఆఫీసర్, మన్మథుడు 2 లాంటి చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. దీనితో తదుపరి చిత్రంపై నాగ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రైడ్ చిత్రంలో సౌరభ్ శుక్లా పాత్రకు ప్రశంసలు దక్కాయి. రీమేక్ లో ఆ పాత్ర కోసం టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ పేర్లని సంప్రదిస్తున్నారు.