మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. పరాజయం ఎరుగని కొరటాల శివ మెగాస్టార్ ని డైరెక్ట్ చేస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ కొన్ని విషయాల్లో పూర్తిగా క్లారిటీ రాలేదు. ఈ చిత్రంలో మహేష్ బాబు గెస్ట్ రోల్ లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా ధృవీకరించలేదు. 

ఇక మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ త్రిషని ఎంపిక చేసుకున్నారు. అధికారికంగా కూడా ప్రకటించారు. స్టాలిన్ మూవీ తర్వాత మెగాస్టార్ తో త్రిష జట్టు కట్టడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కానీ తాజాగా త్రిష బాంబు పేల్చింది. కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్ వేదికగా తాను చిరంజీవి, కొరటాల శివ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. 

కొన్నిసార్లు మనం చెప్పిన విషయాలు, మాట్లాడుకున్న సంగతులు జరగకపోవచ్చు. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల చిరంజీవి సర్ సినిమా నుంచి తప్పుకుంటున్నా. చిత్ర యూనిట్ కి మంచి జరగాలని కోరుకుంటున్నా. తెలుగు ప్రేక్షకులని అలరించడానికి ఓ మంచి చిత్రం ద్వారా మీ ముందుకు రావాలని కోరుకుంటున్నా' అని త్రిష ట్వీట్ చేసింది. 

త్రిష ఈ చిత్రం నుంచి తప్పుకోవడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. త్రిష తప్పుకోవడంతో కొత్త హీరోయిన్ ని చిత్ర యూనిట్ ఎంపిక చేసుకోవాల్సి ఉంది. మరి చిరు, కొరటాల చిత్రంలో నటించే ఆ లక్కీ హీరోయిన్ ఎవరో..