'ఛలో' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మొదటి సినిమాతో హిట్ అందుకుంది. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారింది. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేసింది. అలానే అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి రెడీ అవుతోంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'భీష్మ' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ చేసింది. ఈ క్రమంలో రష్మిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. తనకు సంబంధించిన ఎన్నో విషయాలను మీడియాతో పంచుకుంది.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ లో మార్చిలో జాయిన్ అవుతానని.. డేట్స్ అడ్జస్ట్ చేయలేక హిందీ 'జెర్సీ' సినిమా వదులుకున్నట్లు చెప్పింది. ఈ వాలెంటైన్స్ డే రోజు ఏం చేశారని ప్రశ్నించగా.. ఉదయాన్నే జిమ్ కి వెళ్లానని.. వృత్తిపరంగా పని లేకపోవడంతో ఇంటికి వెళ్లి రొమాంటిక్ సినిమా చూద్దామని హాలీవుడ్ సినిమా చూడడం మొదలుపెట్టినట్లు చెప్పింది.

ఆ తరువాత ఎవరో కథ చెప్పడానికి వస్తే విన్నానని.. వాలెంటైన్స్ డే బోరింగ్ గా సాగిందని.. రాత్రి మాత్రం తన ఫ్రెండ్, డిజైనర్ శ్రావ్య వర్మతో డిన్నర్ కి వెళ్లినట్లు చెప్పింది. గతేడాది ప్రేమికుల రోజులు కూడా తనతో డిన్నర్ కి వెళ్లానని.. ఇద్దరం సింగిల్ గా ఉన్నంతవరకూ డిన్నర్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.