వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారుతోంది. రాజకీయ ప్రముఖులు, చిత్ర పరిశ్రమ సెలెబ్రిటీలు, మహిళా సంఘాలు ఈ క్రూరమైన చర్యని ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. బుధవారం రాత్రి శంషాబాద్ సమీపంలో ప్రియాంక ఒంటరిగా కనిపించడంతో నలుగురు వ్యక్తులు ప్రియాంకపై అత్యాచారానికి తెగబడ్డారు. 

ఆపై ప్రియాంకని సజీవదహనం చేసి క్రూరంగా హత్య చేశారు. ప్రియాంక అదృశ్యమైనట్లు కేసు నమోదు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రియాంక తన సోదరితో మాట్లాడిన చివరి ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

చివరకు ప్రియాంకని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా నేడు పోలీసులు నలుగురు నిందితులని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నిందితులకు ఖఠినమైన శిక్ష విధించాలి అంటూ సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా గళం వినిపిస్తున్నారు. 

హీరో వరుణ్ తేజ్ ట్విట్ చేస్తూ.. ప్రియాంక రెడ్డి హత్యకు సంబంధించిన దారుణమైన వార్త విని చాలా ఆవేదనకు గురయ్యా. చట్టం దోషులని కఠినంగా శిక్షిస్తుందని ఆశిస్తున్నా. వారికి విధించే శిక్ష ఇకపై ఇలాంటి సంఘటనలు పాల్పడాలనే ఆలోచన వచ్చినా భయాన్ని కలిగించేలా ఉండాలి' అని తెలిపాడు. 

దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఇదే తరహాలో స్పందించారు. ప్రియాంక రెడ్డిపై అత్యాచారం, హత్య నాలో  తీవ్రమైన ఆవేదన, భయాన్ని కలిగించాయి. పోలీసులు, న్యాయస్థానం ఆ నలుగురు నిందితులని కఠినంగా శిక్షించాలి. ఈ జంతువులకి విధించే శిక్ష ద్వారా మరోసారి ఇలాంటి సంఘటనకు పాల్పడాలనే ఆలోచన కూడా ఎవరికీ రాకూడదు. మరో ఆడబిడ్డ ఇలాంటి నరకం అనుభవించకూడదు అని అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.