యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం తెనాలి రామకృష్ణ బీఏ బిల్. శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షుకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. క్రిటిక్స్ నుంచి కూడా ఈ చిత్రానికి నెగిటివ్ రివ్యూలే వచ్చాయి. 

దీనిపై సందీప్ కిషన్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను ముందు నుంచి తెనాలి రామకృష్ణ చిత్రం గురించి చెబుతూనే ఉన్నా. మేము ఈ చిత్రం ద్వారా కొత్త కథో, ఉత్కంఠ రేకెత్తించే సినిమానో మేము చేయలేదు. బి, సి సెంటర్స్ ఆడియన్స్ నుంచి మల్టిఫ్లెక్స్ ఆడియన్స్ వరకు అందరిని నవ్వించే ప్రయత్నం చేశాం. 

ఈ చిత్రానికి అద్భుతమైన రేటింగ్స్ వస్తాయని కూడా నేను ఆశించలేదు. కానీ మరీ మీరు తిట్టినంత దారుణమైన సినిమా అయితే ఇది కాదు. అందరూ ఒకసారి చూసి చక్కగా నవ్వుకునే చిత్రం అని రివ్యూలని ఉద్దేశించి సందీప్ కిషన్ అన్నాడు. 

రివ్యూలు మాత్రం నెగిటివ్ గా వచ్చాయి. కానీ ప్రేక్షకుల నుంచి మాత్రం సినిమా బావుంది, నవ్వుకోవచ్చు, యావరేజ్ మూవీ ఒకసారి చూడొచ్చు లాంటి రెస్పాన్స్ వస్తోంది. ప్రతి ఒక్కరూ ఒకసారి ఈ చిత్రాన్ని చూడొచ్చనే చెబుతున్నారు. నాకు ఫోన్లు, మెసేజ్ లు కూడా వస్తున్నాయి. 

తెనాలి రామకృష్ణ చిత్ర నిడివి కేవలం 2:07 గంటలే. సెకండ్ హాఫ్ గురించి కూడా నెగిటివ్ గా రాశారు. కానీ సెకండ్ హాఫ్ లో నాలుగు ఎపిసోడ్స్ బావున్నట్లు కూడా కొంతమంది రాశారు. ఒక గంటలో నాలుగు ఎపిసోడ్స్ అంటే ఎక్కువ సమయమే. ఇక బోర్ కొట్టడానికి ఏముంది అని సందీప్ కిషన్ ప్రశ్నించాడు. 

ఈడోరకం ఆడోరకం ఫేమ్ జి నాగేశ్వర్ రెడ్డి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సందీప్ కిషన్ సరసన ఆపిల్ బ్యూటీ హన్సిక హీరోయిన్ గా నటించింది. నాగ సుభాషణ్ రెడ్డి, సంజీవ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు.