ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్ లో కూడా ఫ్యాన్ వార్స్ మొదలయ్యాయి. అల్లు అర్జున్, మహేష్ బాబు అభిమానుల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది. ఈ సంక్రాంతి కానుకగా ఈ ఇద్దరు హీరోలు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి.

మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకున్నాయి. ఈ రెండు సినిమాలకు అన్ని ఏరియాల నుండి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల కలెక్షన్స్ హాట్ టాపిక్ గా మారాయి.

'అల.. వైకుంఠపురములో' ఫస్ట్ వీక్ కలెక్షన్స్: నాన్ బాహుబలి రికార్డ్!

వారం రోజుల్లో ఈ సినిమాలు వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు పోస్టర్స్ వదిలారు. అయితే బన్నీ సినిమా కలెక్షన్స్ పోస్టర్ పై ఓ వర్గం ఆడియన్స్ నెగెటివ్ కామెంట్స్ చేస్తుండగా.. మహేష్ సినిమా పోస్టర్స్ పై మరో వర్గం నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య కలెక్షన్స్ కి సంబంధించి ఓ యుద్ధమే జరుగుతుంది.

దీంతో బన్నీ ఫ్యాన్స్ #FakeQueenMaheshBabu అనే ట్యాగ్ ని ట్రెండ్ అయ్యేలా చేశారు. మహేష్ బాబు ఫ్యాన్స్ ఊరుకుంటారా..? వాళ్లేమో #FakingKaBaapAlluArjun అనే మరో ట్యాగ్ ట్రెండ్ అయ్యేలా చేశారు. శనివారం నుండి ట్విట్టర్ లో ఈ రెండు టాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

ఇది చూసిన హీరో సిద్ధార్థ్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. #FakeQueenMaheshBabu, #FakingKaBaapAlluArjun అనే ట్యాగ్స్ ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతున్నాయి.. లక్షల కొద్దీ ట్వీట్స్ చేస్తున్నారని.. దేవుడా మా సినిమాను కాపాడు అంటూ విమర్శిస్తూ రాసుకొచ్చాడు. అంతేకాదు.. ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ సిగ్గుచేటు అనే పదాలను వాడాడు. దీంతో బన్నీ, మహేష్ ఫ్యాన్స్ కలిసి సిద్ధార్థ్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి వార్స్ మొదలైందే కోలీవుడ్ నుండి అని.. అక్కడేం మాట్లాడలేక.. తెలుగు సినిమాలు, హీరోలపై కామెంట్స్ చేస్తున్నాడని మండిపడుతున్నారు.