చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎక్కడ చూసినా ఆ వైరస్ కి సంబంధించిన వార్తలే వస్తున్నాయి. చాలా దేశాలు భయంతో వణుకుతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ బారినపడి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు దీనికి విరుగుడు కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు నానాతంటాలు పడుతున్నారు.

ఇక ఈ వ్యాధి మరింత విస్తరించకుండా వైద్యులు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అయితే కరోనా నివారణ కోసం కృషి చేస్తోన్న డాక్టర్లు, నర్సులపై ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా ఆయన డాక్టర్ల కృషిని కొనియాడారు.

ఈ యుద్ధంలో డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్యాధికారులు యోధుల్లా పోరాడుతున్నారని.. వారిని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని అన్నారు. అందరూ ధైర్యంగా ఉండాలని.. మీకోసం ప్రార్ధన చేస్తున్నాం అంటూ రాసుకొచ్చారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది 'కల్కి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజశేఖర్.. ప్రస్తుతం దర్శకుడు వీరభద్రంతో కలిసి సినిమా చేస్తున్నాడు.