లవర్ బాయ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో రాజ్ తరుణ్ గత కొంత కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. కుమారి 21F తరువాత ఆ స్థాయిలో మరో సక్సెస్ అందుకోలేదు. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఈ యువ హీరోకి వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.  కథలను ఎంచుకోవడంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నప్పటికీ రాజ్ తరుణ్ కి అనుకున్నంతగా కమర్షియల్ హిట్ రావడం లేదు.

ఇక నెక్స్ట్ ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాతో ఈ క్రిస్మస్ కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ సినిమా ప్రమోషన్స్ లో రాజ్ తరుణ్ తన పెళ్లికి సంబందించిన విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. 2022లో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎనౌన్స్ చేశాడు.  చాలా రోజులుగా ఈ హీరో ఒక హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడు అంటూ రూమర్స్ వచ్చాయి. లవ్ లో బాగా మునిగిపోయిన రాజ్ కెరీర్ ని పక్కనపెట్టి హీరోయిన్ తో టూర్లకు వెళుతున్నాడని కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి.

'ఇద్దరి లోకం ఒకటే' ట్రైలర్.. రాజ్ తరుణ్ కి హిట్ వస్తుందా..?

ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని రాజ్ తరుణ్ గత ఏడాది కుండబద్దలు కొట్టేసి అసలు విషయాన్నీ బయటపెట్టాడు. గత ఆరేళ్లుగా విజయవాడకు చెందిన ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చాడు. ఇక ఆమెను మరో రెండేళ్లలో పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.   'ఇద్దరిలోకం ఒకటే' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన తదుపరి సినిమా విశేషాల గురించి కూడా రాజ్ తరుణ్ వెల్లడించాడు.

బాలీవుడ్ 'డ్రీమ్ గర్ల్' సినిమా రీమేక్ లో నటించబోతున్నట్లు చెప్పారు. ఆ రీమేక్ హక్కులు సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ల దగ్గర ఉన్నాయి. ఈ బ్యానర్ లో రాజ్ తరుణ్ కి మొదటి సినిమా అవుతుంది. మరోవైపు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు రాజ్ తరుణ్ వెల్లడించాడు. ఇదే బ్యానర్ లో గతంలో'రంగులరాట్నం' లాంటి ఫ్లాప్ సినిమా ఇచ్చినా.. రాజ్ తరుణ్ ని వెతుక్కుంటూ మరో అవకాశం రావడం విశేషం. ఈ సినిమాలతో పాటు గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో ఓ సినిమా కోసం చర్చలు జరుగుతున్నట్లు తెలిపాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన ఈ కుర్ర హీరోని నమ్మి ఇలా వరుస అవకాశాలు ఇవ్వడం విశేషమే మరి.