భీష్మ హిట్ తో జోష్ మీదున్న నితిన్ ఓ మంచి పని కోసం ముందుకు వచ్చాడు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ పై పోరాడేందుకు, సహాయ చర్యలు చేపట్టేందుకు తెలుగు రాష్ట్రాలకు నితిన్ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ సీఎం సహాయనిధికి 1ఓ లక్షలు, ఏపీ సహాయ నిధికి 10 లక్షలు సాయం అందజేస్తున్నట్లు నితిన్సోమవారం ప్రకటించాడు. 

ఇచ్చిన మాట ప్రకారం నేడు నితిన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని నేడు కలుసుకున్నాడు. రూ 10 లక్షల చెక్ ని నితిన్ నేరుగా కేసీఆర్ కు అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ నితిన్ ని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

కరోనాపై పోరాటం చేసేందుకు ముందుకు వచ్చిన ఆర్థిక సాయం అందించిన నితిన్ ని కేసీఆర్ అభినందించారు. తెలంగాణాలో ఇప్పటికే 36 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. 

ఇక నితిన్ త్వరలోనే ఏపీ సీఎం జగన్ ని కూడా కలుసుకుని రూ 10 లక్షల చెక్ అందించబోతున్నట్లు తెలుస్తోంది. నితిన్ చివరగా నటించిన భీష్మ చిత్రం ఫిబ్రవరి 21న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది నితిన్ రంగ్ దే చిత్రంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో.. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నాడు. 

ఏప్రిల్ 16న తన ప్రేయసి షాలినితో నితిన్ వివాహం జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడ్డట్లు వార్తలు వస్తున్నాయి.