కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేస్తోంది. చైనాలోని ఓ మార్కెట్‌లో పుట్టిందని భావిస్తున్న ఈ వైరస్‌ ప్రస్తుతం 200లకు పైగా దేశాలను స్థంబించిపోయేలా చేస్తోంది. ఈ వైరస్ కారణంగా మన దేశంలో కూడా అన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి. అయితే ప్రస్తుతం వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్నీ ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. వైరస్‌ పుట్టుకకు కారణమైన చైనా మాత్రం వైరస్‌ ఉపద్రవం నుంచి బయట పడింది. దీంతో చైనా తీరుపై ప్రపంచ వ్యాప్తంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదిక గా సంచలన వ్యాఖ్యలు చేశాడు. `చిరవకు అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. జనవరిలో చైనా వుహాన్ నుంచి చైనాలోని అన్ని ప్రాంతాలకు వెళ్లే లోకల్‌ ఫ్లైట్స్‌ను ఆపేసింది. కానీ అంతర్జాతీయ విమానాలను మాత్రం తరువాత కూడా కొనసాగించింది. చైనా అలా ఎందుకు చేసింది. వుహాన్‌ నుంచి ఇతర దేశాలకు ప్రజలను ఎందుకు అనుమతించింది` అంటూ కామెంట్ చేశాడు. అంటే చైనా కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇలా చేసిందా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల అర్జున్‌ సురవరం సినిమాతో మరో హిట్‌ ను తన ఖాతాలో వేసుకున్న నిఖిల్, తరువాత కార్తీకేయ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న కార్తికేయ 2ను ప్రారంభించాడు. అయితే ప్రస్తుతం లాక్‌ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ లాక్‌ డౌన్‌ సమయంలోనే నిఖిల్ పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు.