టాలీవుడ్ యువ హీరో నిఖిల్.. ఇటీవలే ఓ ఇంటివాడు అయ్యాడు. లాక్ డౌన్ నియమాలను పాటిస్తూ.. పల్లవి కి మూడు ముళ్ల వేసి.. ఏడు అడుగులు నడిచారు. కాగా.. ప్రస్తుతం ఆయన  మనదేశంలో అమలౌతున్న లాక్ డౌన్ 5.0 మీద భారీ సెటైర్ వేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేయగా... ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇంతకీ నిఖిల్ చేసిన ట్వీట్ ఏమిటంటే.. ‘‘కోవిడ్ 19 కేసులు 10 ఉన్నప్పుడు మనం అందరం లాక్‌డౌన్‌లో ఉన్నాం.. కానీ ఇప్పుడు 2 లక్షల ప్లస్ ఉన్నాయి మనం మాత్రం ఫ్రీగా బయట తిరిగేస్తున్నాం.. లాజిక్ ఏంటంటారు?’’ అని నిఖిల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు అనేకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కానీ నిఖిల్ అడిగిన లాజిక్ మాత్రం ఎవ్వరూ సరిగా చెప్పలేకపోతున్నారు. 

నిజంగా కేసులు తక్కువ ఉన్నప్పుడు భయపడి బయటికి రాలేదు. కానీ ఇప్పుడు భయపడేలా కేసులు నమోదు అవుతున్నాయి. కానీ ప్రజలు ఏ మాత్రం భయపడకుండా రోడ్లపైన తిరిగేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా చేతులెత్తేశాయి. జాగ్రత్తగా ఉండండి అని ప్రభుత్వాలు హెచ్చరించినప్పుడే రోడ్లపైన జనాలు చిన్న చిన్న విషయాల కోసం తిరిగారు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా చూసీచూడనట్లుగా వదిలేస్తున్నాయి. పరిస్థితులను అర్థం చేసుకుని ఎవరికి వారు స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటించడమే తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఏదిఏమైనా రానున్న రోజులు ప్రజలకు మరింత కఠినతరం కాబోతున్నాయన్నది మాత్రం వాస్తవం.

ఇదిలా ఉండగా.. నిఖిల్ ఇటీవల అర్జున్ సురవరం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం పలు చిత్రాలకు సైన్ చేశారు. ఈ లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఈ సినిమాలు పట్టాలెక్కే అవకాశం ఉంది.