మంచు లక్ష్మీ చేస్తున్న ఈ రియాలిటీ షో ముఖ్య ఉద్దేశం స్టార్స్  వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడం. ఇటీవల వరుణ్ తేజ్, సమంత లాంటి స్టార్స్ తో లక్ష్మీ ఈ షో చేసింది. తాజాగా మంచు లక్ష్మీ షోకి యంగ్ హీరో నిఖిల్ అతిథిగా హాజరయ్యాడు. నిఖిల్ కెరీర్ కు సంబంధించిన విషయాలే కాక వ్యక్తిగత విషయాలని కూడా తెలుసుకునే ప్రయత్నం చేసింది. 

ఈ షోలో నిఖిల్ కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులని తెలియజేశాడు. కొందరిని నమ్మి లక్షల్లో డబ్బు కూడా మోసపోయానని నిఖిల్ తెలిపాడు. కెరీర్ ఆరంభంలో తనతో సినిమా చేస్తామని కొందరు వ్యక్తులు సంప్రదించారు. దీనికి ప్రతిఫలంగా తమకు 10 లక్షల వరకు చెల్లించాలని అడిగారు. 

అవకాశం కోసం మా నాన్నని అడిగి మరీ వారికి డబ్బు ఇచ్చా. కొన్నిరోజుల పాటు షూటింగ్ చేస్తున్నట్లు నటించారు. ఆ తర్వాత కంటికి కనిపించకుండా మాయమయ్యారు. 

ఈ విషయం విన్న మంచు లక్ష్మీ షో వేదికగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్న కొత్తవారికి సందేశాన్ని ఇచ్చింది. టాలీవుడ్ లో మీ దగ్గర డబ్బు తీసుకుని అవకాశం ఇస్తామని చెప్పే వారిని నమ్మకండి. నిజంగా ఇండస్ట్రీలో ఉన్నవారు అలా చేయరు. నిర్మాత ఆర్థిక పరిస్థితి బట్టి, మీ పాత్రని బట్టి తక్కువ డబ్బు ఇవ్వొచ్చు. అంతేకాని మీ దగ్గర డబ్బులు తీసుకోరు అని మంచు లక్ష్మి తెలిపింది. 

శేఖర్ కమ్ముల తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ హ్యాపీడేస్ చిత్రంతో నిఖిల్ టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. హ్యాపీడేస్ తర్వాత నిఖిల్ కు అనేక అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని ఇప్పుడు నిఖిల్ టాలీవుడ్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు.