బుధవారం రోజు అకస్మాత్తుగా పలువురు టాలీవుడ్ ప్రముఖుల నివాసాలు, కార్యాలయాలు టార్గెట్ గా ఐటీ అధికారులు సోదాలు మొదలు పెట్టారు. మొదటగా రామానాయుడు 
స్టూడియోలో ఐటి అధికారుల దాడులు మొదలయ్యాయి.

ఆ తర్వాత సురేష్ బాబు నివాసం, సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయంలో కూడా ఐటీ ఆఫీసర్స్ సోదాలు నిర్వహించారు. ఆ తరువాత సురేష్ బాబు తమ్ముడు, హీరో వెంకటేష్ ఇంట్లో దాడులు జరిపారు. అలానే హీరో నాని నివాసం, హారిక అండ్ హాసిని, సితార ఎంటర్టైన్మెంట్స్ పై ఐటీ దాడులు జరిపారు. 

హీరో వెంకటేష్ ఇంటిపై ఐటీ అధికారుల అటాక్.. ఈరోజంతా కొనసాగే అవకాశం!

గతంలో కూడా పలు సందర్భాల్లో టాలీవుడ్ ప్రముఖులపై ఆదాయపు పన్ను శాఖా అధికారులు దాడులు నిర్వహించారు. కానీ ఇలా ఒకేసారి ఇంతమంది ప్రముఖులను టార్గెట్ చేయడం జరగలేదు. దీంతో ఈ సోదాలు టాలీవుడ్ లో కలకలం సృష్టించాయి. ఈ దాడులకు సంబంధించి ఎలాంటి వివరాలు ఇప్పటివరకు బయటకి రాలేదు.

అయితే ఈ దాడులపై యువనటుడు నవదీప్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. బుధవారం రాత్రి ట్విట్టర్ లో నవదీప్.. ''ఒకవేళ ఇన్‌కం టాక్స్ అధికారులు తన మీద దాడులు జరిపితే.. వాళ్లే కొంత డబ్బుని వదిలేసి వెళ్లిపోతారు'' అంటూ పోస్ట్ లో రాసుకొచ్చాడు.

ఈ కామెంట్ కి #billbandbaajaఅనే హ్యాష్ ట్యాగ్ జోడించాడు. ఒకప్పుడు హీరో ఎన్నో సినిమాలు చేసిన నవదీప్ ఖాతాలో కొన్ని హిట్లు కూడా ఉన్నాయి. కానీ హీరోగా అతడికి  అవకాశాలు తగ్గిపోయాయి.

బిగ్ బాస్ సీజన్ 1లో కనిపించి అందరినీ నవ్వించిన ఈ హీరో ప్రస్తుతం 'అల.. వైకుంఠపురములో' సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.