సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతుల ముద్దల కూతరు సితార ఘట్టమనేని ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె మాటలు, పాటలు, డాన్స్ లకు సంబంధించిన వీడియోలు నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఆ విధంగా సితారకి కూడా ఫ్యాన్స్ ఉన్నారు.

ఇటీవల దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టింది సితార. ఇందులో చిన్న చిన్న వీడియోలు పెడుతూ ఎంటర్టైన్ చేస్తుంది. ఇప్పుడు ఈ బ్యూటీకి మంచి ఆఫర్ వచ్చింది.

ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కాబోతున్న హాలీవుడ్ భారీ యానిమేటెడ్ సినిమా 'ఫ్రోజెన్-2' తెలుగు వెర్షన్ కోసం సితార డబ్బింగ్ చెప్పనుంది. సినిమాలో బేబీ 'ఎల్సా' పాత్రకు సితార తన వాయిస్ ని అందించనుంది. ఈ విషయాన్ని ప్రఖ్యాత డిస్నీ సంస్థ వారు కాసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వెల్లడించారు. 

ఇప్పటికే  తన ఆటపాటలతో ఆకట్టుకుంటూ మహేష్‌బాబు అభిమానులను మురిపిస్తున్నసితార తన డబ్బింగ్ టాలెంట్ తో ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతోంది. మరోవైపు యువరాణి ఎల్సా పాత్రకు  ప్రముఖ నటి నిత్యామీనాన్‌ డబ్బింగ్‌చెప్పనున్నారు.

2013లో విడుదలైన  హాలీవుడ్‌ సినిమా 'ఫ్రోజెన్' మంచి సక్సెస్ అందుకుంది. ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటేడ్ చిత్రంగా రికార్డును సొంతం చేసుకుంది. దానికి సీక్వెల్ గా వచ్చిన చిత్రమే 'ఫ్రోజెన్-2'. మరి ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!