హీరోయిజం కన్నా నటనకు ప్రాధాన్యత ఇచ్చే హీరో సూర్య. అతడి తమ్ముడు కార్తీ కూడా అన్న బాటలోనే పయనిస్తున్నాడు. విభిన్నమైన చిత్రాలని ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. కార్తీ నటించిన కొన్ని చిత్రాలు నిరాశపరిచిన అతడి జోరుకు అవి అడ్డు కాలేదు. 

కార్తీ రీసెంట్ గా ఖైదీ చిత్రంతో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో వసూళ్ల పంట పండించింది. తక్కువ గ్యాప్ లోనే కార్తీ మరో చిత్రంతో వచ్చేస్తున్నాడు. ఖైదీ తర్వాత కార్తీ నటిస్తున్న చిత్రం దొంగ. తమిళంలో తంబిగా ఈ చిత్రం తెరక్కుతోంది. 

సూర్య సతీమణి జ్యోతిక ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. రియల్ లైఫ్ లో వదిన, మరిది అయిన జ్యోతిక, కార్తీ ఈ చిత్రంలో అక్కా తమ్ముళ్లుగా నటిస్తున్నారు. మలయాళంలో దృశ్యం చిత్రాన్ని తెరకెక్కించిన జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకుడు. 

తాజాగా చిత్ర యూనిట్ టీజర్ ని రిలీజ్ చేసింది. కింగ్ నాగార్జున సోషల్ మీడియా వేదికగా దొంగ టీజర్ రిలీజ్ చేశారు. 'అతడి పేరు ఏమని చెప్పాడు.. విక్కీ, గురు, అర్జున్.. ఒక్కొక్క కేసుకు ఒక్కో పేరు' అంటూ కార్తీ పాత్రని తెలియజేసేలా బ్యాగ్రౌండ్ లో వస్తున్న వాయిస్ ఓవర్ ఆసక్తికరంగా ఉంది. 

కార్తీ సోదరిగా జ్యోతిక ఎమోషనల్ పాత్రలో నటిస్తోంది. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. టీజర్ చూశాక కార్తీ నుంచి రాబోతున్న మరో వైవిధ్యభరితమైన చిత్రం దొంగ అని చెప్పొచ్చు. వికామ్ స్టూడియోస్, సూరజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోవింద్ వసంత ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. డిసెంబర్ లో దొంగ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.