'బాహుబలి' సినిమా తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం 'RRR'. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి నటితోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన ప్రతీ విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సినిమాలో కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి 'RRR' అనే వర్కింగ్ టైటిల్ అనౌన్స్ చేసిన చిత్రబృందం దాన్ని ప్రతిబింబించే టైటిల్ పెట్టాలని భావించారు. ఈ మేరకు అభిమానులను టైటిల్ సూచించాలని సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేశారు. ఈ క్రమంలో కొన్ని వందల టైటిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 

అందులో ఓ పేరుని చిత్రబృందం ఖరారు చేసిందని సమాచారం. ఈ సినిమాకి 'రామ రౌద్ర రుషితం' అనే పేరు బాగుంటుందని అనుకుంటున్నారట. మిగిలిన భాషల్లో 'రైజ్ రివోల్ట్ రివెంజ్' పేరుతో విడుదల కానుందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం రూ.350 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. 

ఎన్టీఆర్‌ ఇందులో కొమరం భీమ్‌గా, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అజయ్‌ దేవగణ్‌ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. దాదాపు బాహుబలి చిత్రానికి పనిచేసిన టీం ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం కష్టపడుతోంది.బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ కథను అందిస్తుండగా.. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. సెంథిల్ కుమార్  సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.