మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ బాబు నుంచి వస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి విడుదలకు ఈ చిత్రం ముస్తాబవుతోంది. భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు ఆర్మీ మేజర్ గా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 

ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచేసింది. ప్రతిసోమవారం విడుదల చేస్తున్న పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రం నుంచి మూడో పాటని విడుదల చేశారు. ''హి ఈజ్ సో క్యూట్' అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోను విడుదుల చేశారు. 

సాధారణంగా హీరోలు హీరోయిన్లని టీజింగ్ చేసే పాటలు ఎక్కువగా వస్తుంటాయి. కానీ ఇది రష్మిక మహేష్ బాబుని టీజ్ చేసే పాట. 'హి ఈజ్ సో క్యూట్' అంటూ సాగే ఈ పాటలో రష్మిక మహేష్ బాబు వెంటపడుతూ అతడిని ఏడిపిస్తోంది. 

ఈ పాటకు శ్రీమణిసాహిత్యం అందించారు. మహేష్ బాబు అందాన్ని పొగుడుతూ శ్రీమణి చక్కటి లిరిక్స్ అందించాడు. ప్రముఖ సింగర్ మధుప్రియ ఈ పాటని పాడింది. రష్మిక బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా మధుప్రియ తన గాత్రంతో ఆకట్టుకుంది. 

ఈ సాంగ్ లో రష్మిక వేస్తున్న కొన్ని డాన్స్ మూమెంట్స్ ని కూడా చూపించారు. మహేష్ వెంటపడుతూ రష్మిక వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. దేవిశ్రీ  ప్రసాద్ మంచి ట్యూన్ అందించాడు. ఈ పాటలో హీరోయిన్ సంగీత, నటి హరి తేజ కూడా ఈ సాంగ్ లో కనిపిస్తున్నారు.