ఇబ్బందుల నడుమ గద్దలకొండ గణేష్ చిత్రం విడుదలైనప్పటి మంచి విజయం సాధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుణ్ ని మాస్ లుక్ లో హరీష్ ప్రజెంట్ చేశాడు. రీమేక్ చిత్రమే అయినప్పటికీ హరీష్ ఈ చిత్రంలో తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా, వరుణ్ బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా మార్పులు చేసుకున్నారు. వరుణ్ నటన, హరీష్ టేకింగ్ కు ప్రశంసలు దక్కాయి. 

కమర్షియల్ గా కూడా ఈ చిత్రం విజయం సాధించింది. ఇదిలా ఉండగా గద్దలకొండ గణేష్ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఓ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. హరీష్ డైరెక్ట్ చేసిన గబ్బర్ సింగ్, డీజే చిత్రాలకు రాక్స్టార్ దేవిశ్రీ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. 

గద్దలకొండ గణేష్ చిత్రానికి కూడా ముందుగా దేవిశ్రీనే సంగీత దర్శకుడు అనుకున్నారు. కానీ దేవిశ్రీ తప్పుకోవడంతో మిక్కిజె మేయర్ కు అవకాశం వచ్చింది. దీనిపై హరీష్ క్లారిటీ ఇస్తూ.. నిజమే ముందుగా ఈ చిత్రానికి దేవిశ్రీనే మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నాం. 

దేవిశ్రీకి కూడా కథ నచ్చింది. కానీ ఈ చిత్రంలో ఓ రీమిక్స్ సాంగ్ చేయాలి. దేవిశ్రీ ఎన్నో చిత్రాలకు సంగీతం అందించారు. రీమిక్స్ సాంగ్స్ చేయకూడదనే నియమాన్ని ఆయన పాటిస్తారు. అయినా కూడా ఎలాగోలా ఒప్పించవచ్చులే అనే అతివిశ్వాసంతో దేవిశ్రీ వద్దకు వెళ్ళా. దేవిశ్రీ పాటిస్తున్న నియమాన్ని బ్రేక్ చేయించాలనుకోవడం నాదే తప్పు. 

రీమిక్స్ సాంగ్ కు దేవిశ్రీ అంగీకరించలేదు. చాలా ఫ్రెండ్లిగానే తన నిర్ణయాన్ని దేవిశ్రీ తిరస్కరించాడు. అంతకు మించి మా మధ్య ఎలాంటి సమస్యలు లేవు. త్వరలోనే దేవిశ్రీతో సినిమా చేస్తా అని హరీష్ పేర్కొన్నాడు. 

హరీష్ నిజాయతీతో ఇచ్చిన క్లారిటీకి దేవిశ్రీ ప్రసాద్ ఫిదా అయ్యాడు. హరీష్ చెప్పిన సంగతులని ట్వీట్ చేస్తూ కృతజ్ఞతలు తెలిపాడు.