ఒకప్పుడు తమిళ దర్శకులంటే తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉండేది. మన హీరోలు పిలిచి మరీ తమిళ దర్శకులకు అవకాశాలు ఇచ్చేవారు. దీంతో కొంతకాలం పాటు కోలీవుడ్ దర్శకుడు తెలుగులో రాజ్యమేలారు. కానీ రాను రాను వారి క్రేజ్ బాగా తగ్గిపోయింది.

తమిళ దర్శకులను మన హీరోలు పక్కన పెట్టారు. పైగా వారు తీస్తోన్న సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో వాళ్ల హవా పూర్తిగా తగ్గిపోయింది. తెలుగులో కూడా కొత్త దర్శకులు తమ సత్తా చాటుతుండంతో కోలీవుడ్ వైపు చూడడం మానేశారు మన హీరోలు. అయితే హీరో గోపీచంద్ మాత్రం తమిళ దర్శకులను నమ్ముకొని నిండా మునిగిపోయాడు.

గోపీచంద్ నటించిన 'ఆక్సిజన్', 'చాణక్య' రెండు సినిమాలను తమిళ దర్శకులే డైరెక్ట్ చేశారు. జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసిన 'ఆక్సిజన్' అట్టర్ ఫ్లాప్ అయింది. సినిమాలో భారీతనం ఉన్నా.. కంటెంట్ లేకపోవడంతో పరాజయం తప్పలేదు. తెలుగు ప్రేక్షకుల రుచి తెలుసుకోలేక జ్యోతికృష్ణ తప్పటడుగులు వేశాడు. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ గోపీచంద్ మరో తమిళ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడు.

కోలీవుడ్ డైరెక్టర్ తిరు డైరెక్ట్ చేసిన 'చాణక్య' ఇటీవల విడుదలై ఫ్లాప్ టాక్ దక్కించుకుంది. స్క్రీన్ ప్లే పరంగా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సినిమా వర్కవుట్ అవ్వలేదు. దీంతో గోపీచంద్ ఖాతాలో మరో ఫ్లాప్ పడింది. ఇలా కోలీవుడ్ దర్శకులను నమ్ముకొని గోపీచంద్ భంగపడ్డాడు.