ప్రముఖ సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు అనారోగ్యం కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. మనందరికీ ఆయన గొప్ప నటుడిగా, రచయితగా తెలుసు. అయితే... ఆయనకు చిన్నప్పటి నుంచి నాటకాలపై ఆసక్తి ఉన్నప్పటికీ.. ఆ దిశగా ఇంట్లో ప్రోత్సాహం మాత్రం దక్కలేదు. అంత చదువుకొని సినిమాల్లోకి, నాటకాల్లోకి పోతావా అంటూ వాళ్ల నాన్న తరచూ కోపడేవాడట. ఆయన పలు ఉద్యోగాలు చేసిన తర్వాత అనుకోకుండా ఆయన ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాని తన పేరెంట్స్ ని తీసుకువెళ్లినప్పుడు వాళ్ల రియాక్షన్ ఎలా ఉందో ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

‘‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాను మా అమ్మకు నాన్నకు చూపించాలనుకున్నా. వాళ్లిద్దర్నీ థియేటర్‌కు తీసుకెళ్లాను. నాలుగైదు సీన్లు అయ్యాయి. మా అమ్మ ఏమీ రియాక్టు కావడం లేదు. ‘సినిమా చూస్తున్నావా అమ్మా. అందులో ఉన్నది నేనే’ అన్నాను. సినిమా అంతా పూర్తయ్యాక కారులో వెళుతున్నపుడు మరోసారి అడిగితే ‘ఏమోరా ఆ సినిమాలో నిన్ను అందరూ తిడుతున్నారు. ఇంకో వేషం ఉందే అది వేయాల్సింది’ అంది. ఇంకో వేషం అంటే చిరంజీవి వేషం (నవ్వులు). అమ్మ అనే పరిధి నుంచి ఆవిడ బయటికి వచ్చి నన్ను చూడలేకపోయింది. ‘అభిలాష’ కోసం శ్మశానంలో నటించాల్సి వచ్చింది. అప్పుడు కూడా ‘నువ్వు నటించడానికి వీల్లేదు’ అంది అమ్మ. ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడు కూడా ‘అమ్మా నేను అక్కడ పెద్ద డ్యూటీ ఆఫీసర్‌ను..’ అంటే - ‘నువ్వు రేడియోలో ఏమైనా మాట్లాడతావా?’ అనేది. ‘నేను మాట్లాడేవాళ్లకు ఇంఛార్జిని’ అన్నాను. ‘ఎందుకు ఆ దిక్కుమాలిన ఉద్యోగం. కనీసం మాట్లాడితేనైనా రేడియోలో వినొచ్చు కదా!’ అనేది.’’

‘‘ఒక రోజు హైదరాబాద్‌ రేడియో స్టేషన్‌కు వచ్చింది అమ్మ. అక్కడ స్థానం నరసింహారావుగారు కనిపించారు. ఆయనకు అమ్మను పరిచయం చేయగానే - ‘బాగా రాస్తాడమ్మా వీడు. మంచి కుర్రాడు’ అన్నారాయన. నరసింహారావుగారిని అమ్మ గుర్తుపట్టింది. ‘వీళ్లందరి దగ్గర పనిచేస్తున్నావా నువ్వు.. పోన్లే మంచి ఉద్యోగమే’ అంది. నేను పనిచేసే ఆలిండియా రేడియో కంటే వాళ్లు పనిచేస్తున్న ఆలిండియా రేడియోనే ఆవిడకు గొప్పగా అనిపించింది.’’