గొల్లపూడి మారుతీరావు అనగానే అందరికీ ఆయన నటించిన సినిమాలు, ఆయన రాసిన మాటలు ఇవే గుర్తుకువస్తాయి. అయితే.. కేవలం ఆయన సినిమాల్లో మాత్రమే కాదు.. సీరియల్స్ లో కూడా నటించారు. వెండితెరపై మాత్రమే కాకుండా... బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేశాడు గొల్లపూడి. 

ప్రతిధ్వని అనే కార్యక్రమానికి మొదట్లో వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆయ‌న అన్ని రంగాలకు చెందిన ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాడు. ఇదీ కాక భార్యాభర్తల నేప‌థ్యంలో మనసున మనసై అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించాడు. ప్రజావేదిక, వేదిక, దూరదర్శన్, సినీ సౌరభాలు మొదలైన కార్య‌క్రామ‌ల‌ని ఆయ‌న నిర్వ‌హించారు. వీటికి ఎంతో ప్ర‌జాద‌ర‌ణ ల‌భించింది.

ఇంటింటి రామాయణం, గణపతి, ఎవరి గోల వారిదే, ప్రేమలు-పెళ్ళిళ్ళు, భార్యారూపవతీ శత్రుః, ఏది నిజం? అనే సీరియ‌ల్స్‌లోను గొల్ల‌పూడి ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఇవికాకుండా.. ఆయన సినిమాల్లోకీ, సీరియళ్లోకి రాకముందు పలు నాటకాల్లో నటించిన అనుభవం ఉంది.

చిన్న వ‌య‌స్సులో రాఘ‌వ క‌ళానికేత‌న్ పేరున నాట‌క బృందాన్ని న‌డిపిన గొల్ల‌పూడి .. ఆడది (పినిశెట్టి), కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం (రావి కొండల రావు), రిహార్సల్స్ (సోమంచి యజ్ఞన్న శాస్త్రి), వాపస్ (డి.వి.నరసరాజు), మహానుభావులు వంటి నాటకాలకు నిర్మాణం, దర్శకత్వం వహించడంతో పాటు, ప్రధానపాత్రధారిగా నటించాడు.


ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కె.వి.గోపాలస్వామి దర్శకత్వం వహించిన స్నానాలగది నాటకంలోనూ, భమిడిపాటి రాధాకృష్ణ రచించిన మనస్తత్వాలు నాటకంలోనూ నటించాడు గొల్ల‌పూడి. మ‌న‌స్త‌త్వాలు నాట‌కాన్ని ఢిల్లీలోని త‌ల్క‌తోరా ఉద్యాన‌వ‌నంలో ప్ర‌ద‌ర్శించారు. ఈ నాట‌కం ప్ర‌తి ఒక్క‌రిని అల‌రించింది. ఇందుకు గాను అప్ప‌టి స‌మాచార‌, ప్రసార శాఖామాత్యుడు బి.వి, కేశ్‌క‌ర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు గొల్ల‌పూడి.