దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటించి నాలుగు నంది అవార్డులను సొంతం చేసుకున్నారు మారుతీరావు. రేడియోతో మొదలుపెట్టి సినిమాల్లో తనదైన శైలిలో రాణించి  ముందు కెళ్లారు. ఓ టైమ్ లో రచయితగా పూర్తి స్దాయి బిజీ అయ్యిపోయారు. అయిదు కాల్షీట్లు పనిచేసిన రోజులు ఉన్నాయి. అంత బిజీలో ఒక రోజు రామారావుగారు ఫోన్‌ చేసి.. ఒక సినిమాకు రాయమంటే ‘ఇప్పుడు రాస్తున్న అయిదు సినిమాలూ మీవే. మరొకటంటే కష్టం’ అన్నాను అని గుర్తు చేసుకున్నారు ఓ ఇంటర్వూలో  గొల్లపూడి.

అలాగే అప్పుడే -ఒక రోజు రాత్రి ఆయన భార్య గొల్లపూడి దగ్గరికి వచ్చి ‘ఏమండీ మీరు సినిమాకు ఎంత పుచ్చుకుంటారండీ’ అంది. ఆయన చెప్పారు.  ‘నేనొక పనిచేస్తానండి. ఆ అమౌంట్‌ మీ అకౌంట్‌లో వేస్తాను. నాక్కూడా ఒక గంట టైమ్‌ ఇవ్వండి..’ అంది. ఆ మాట విన్నాక రాస్తున్న కలాన్ని కిందపడేశారు. ‘ఆ గంటలో ఏం చేస్తావ్‌?’ అన్నారు. ‘ఆ గంటలో మన అబ్బాయికి ఎలాంటి బట్టలు కుట్టిద్దాం, ఊరికి వెళ్లినప్పుడు వాడు ఏం చేశాడు, ఎన్నో క్లాసు చదువుతున్నాడు, ఏ పుస్తకం చదువుతున్నాడు.. ఇవాళ ఏ కూర వండుదాం.. ఇవన్నీ చెబుతాను’ అని చెప్పింది. కెరీర్‌లో పడి ఫ్యామిలీని మిస్‌ అయ్యాను అన్న సంగతి అర్థమైందని చెప్పారాయన.

 ‘ఆడది’, ‘కుక్కపిల్ల దొరికింది’, ‘స్వయంవరం’, ‘రిహార్సల్స్’, ‘వాపస్’, ‘మహానుభావాలు’ లాంటి నాటకాలకి నిర్మాణం, దర్శకత్వం వహించడంతో పాటు.. ప్రధాన పాత్రధారిగా కూడా నటించారు. విద్యార్థి దశలో ఉండగానే ‘స్నానాలగది’, ‘మనస్తత్వాలు’ నాటకంలోనూ అభినయించారు. అప్పట్లో చైనా ఆక్రమణపై తెలుగులో మొట్టమొదటి నాటకమైన ‘వందేమాతరం’ని రచించారు.

చిరంజీవి హీరోగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రానికి మాటల రచయితగా కూడా పనిచేశారు. 1963లో ‘డాక్టర్‌ చక్రవర్తి’ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు గొల్లపూడి. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథా రచయితగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డుని అందుకున్నారు. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ తర్వాత నటుడిగా కూడా బిజీ అయిపోయారు.