గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ బ్యానర్స్ పై బన్నీవాసు నిర్మిస్తున్న చిత్రం ప్రతిరోజూ పండగే. సూపర్ హిట్ జోడి సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నా ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ఇది వరకే వీరిద్దరూ సుప్రీం చిత్రంలో నటించారు. కుటుంబ కథా చిత్రాలకు వినోదాన్ని జోడించడంలో మారుతి సిద్ధహస్తుడు. 

మారుతి, తేజు తొలి కాంబోలో వస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇది వరకే విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నేడు తేజు పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్ ని రిలీజ్ చేసింది. 

40 సెకండ్ల టీజర్ లో ఎలాంటి డైలాగులు లేనప్పటికీ ఈ చిత్రం ఎంత కలర్ ఫుల్ గా, ఎంటర్టైనింగ్ గా ఉండబోతోందో చూపించారు. తేజు, రాశి ఖన్నా మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు ఉంది. ఇక తేజు తన ఫ్యామిలీతో చేసే సందడి బావుంది. ముఖ్యంగా సత్యరాజ్ పాత్ర సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. 

తేజు, సత్యరాజ్ మధ్య బలమైన ఎమోషనల్ సీన్స్ ఉండబోతున్నాయి. రావు రమేష్ కూడా ఈ చిత్రంలో నటించారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.