నటుడు విశాల్, అనీషారెడ్డిల వివాహం గురించి ఇటీవల రకరకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మర్చి 18న కుటుంబసభ్యులు,ముఖ్యమైన బంధుమిత్రుల సమక్షంలో విశాల్, అనీషాల ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విశాల్ తన పెళ్లి నడిగర్ సంఘం నూతన భవనంలో జరుగుతుందని ప్రకటించారు. అలానే అక్టోబర్ 9న వీరి వివాహమా జరగనుందనే ప్రచారం జరిగింది.

అయితే దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ రాకపోవడం, అనీషా తన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి ఎంగేజ్మెంట్ ఫోటోలు తొలగించడంతో వీరి పెళ్లి రద్దయ్యిందనే ప్రచారం జరిగింది. విశాల్, అనీషాల మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారనే మాటలు వినిపించాయి. అయితే ఈ విషయంపై అటు విశాల్ కానీ అనీషా రెడ్డి కానీ స్పందించలేదు.

అయితే తాజాగా చెన్నైలో జరిగిన దమయంతి చిత్ర మీడియా సమావేశంలో పాల్గొన్న విశాల్ తండ్రి జీకే రెడ్డిని ఈ విషయంపై ప్రశ్నించగా.. ఆయన విశాల్, అనీషా రెడ్డిల వివాహం నిర్ణయించిన ప్రకారం జరుగుతుందని చెప్పారు. అయితే పెళ్లి డేట్ ని మాత్రం ఇంకా నిర్ణయించలేదని అన్నారు. నడిగర్ సంఘం నూతన భవనంలో తన పెళ్లి జరగనున్నట్లు విశాల్ ప్రకటించారని.. అయితే ఇటీవల జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపును కోర్టు నిలిపివేసిందని.. ఆ ఫలితాలు వెల్లడైతే విశాల్ జట్టు గెలవడం ఖాయమని అన్నారు.

ఆ తరువాత నడిగర్ సంఘం భావన నిర్మాణాన్ని విశాల్ పూర్తి చేస్తారని, తను ప్రకటించిన విధంగానే అదే నూతన భవనంలో పెళ్లి జరుగుతుందని అన్నారు. అదే విధంగా నటుడు శరత్ కుమార్, రాధికా శరత్ కుమార్ తమ కుటుంబసభ్యులేనని.. వారితో తమకు ఎలాంటి శత్రుత్వం లేదని జీకే రెడ్డి తెలిపారు.