Asianet News TeluguAsianet News Telugu

పాత బంగారం : చిరంజీవి అప్పుడే 'గూండా'నా..బాధపడుతున్నా

అవి చిరంజీవి మెగాస్టార్ కాక ముందు ..హీరోగా నిలదొక్కుకుంటూ,విభిన్నమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్న రోజులు.  ఆ క్రమంలో ఆయన గూండా టైటిల్ తో ఓ సినిమా చేసారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఈ చిత్రం నూట యాభైవ రోజు వేడుకలు సైతం జరిపారు.  ఈ వేడుక చాలా సరదాగా జరిగింది. ఆ విషయాలు సరదాగా గుర్తు చేసుకుందాం. 

Fun at Chiranjeevis' Goonda movie 150 days function
Author
Hyderabad, First Published Dec 10, 2019, 4:34 PM IST

ఆ వేడుక జూలై 15,1984  వ తేదీ సాయింత్రం మద్రాస్ అడయార్ గేట్ హోటల్లో జరిగింది. ఆ రోజు ఆ చిత్ర నిర్మాత మిద్దే రామారావు పుట్టిన రోజు కావటం మరో విశేషం. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత రావు గోపాల రావు.  

చీఫ్ గెస్ట్ డి.వియస్ రాజు మాట్లాడుతూ... మిద్దే రామారావు సాధించిన విజయాలకు ఓ  గుర్తు ఈ చిత్రం 150 రోజులు నాలుగు కేంద్రాల్లో ఆడటం అని అంటూ టైటిల్ ని ఉద్దేశించి కొన్ని చురకలు వేసారు.  ప్రజలు కోరిన చిత్రాలే నిర్మాతలు తీస్తున్నారు. టైటిల్స్ కూడా అలాగే ఉంటున్నాయి. అయితే చిరంజీవిని అప్పుడే గూండా గా చూపించటం బాధ పడుతున్నాను. జనానికి అదే కావాలి కాబట్టి తప్పదు. క్లైమాక్స్ లో అతను డూప్ లేకుండా నటించాడు. ఇక ముందు అటువంటి రిస్క్ లు తీసుకోవద్దని కోరుతున్నాను అన్నారు. ఆయన అలా అనటం అప్పట్లో చర్చనీయాంసంగా మారింది. మీడియాలోనూ ఈ విషయం హైలెట్ అయ్యింది.

ఇక మరో గెస్ట్ గా వచ్చిన రెబల్ స్టార్ కృష్ణం రాజు మాట్లాడుతూ... ఒక సోదరుడుగా చిరంజీవిని నేను కోరేది ఏమిటంటే గూండా గూండాగా  ఉండిపోకుండా మంచివాళ్ల లిస్ట్ లో చేరిపొమ్మని, ఎందుకంటే నేను  కటకటాల రుద్రయ్య గా ఉండిపోకుండా బాపు గారి మనవూరి పాండవులు చిత్రం చేసాను. ఆ సమయంలో ఆ సినిమా రిలీజ్ అయ్యి నాకు మంచి గుర్తింపు ని తెచ్చింది.  మనవూరి పాండవులు లాంటి మంచి చిత్రం నటనకి గూటురాయి . అలాంటి చిత్రాల్లో నటించాలని చిరంజీవి కోరుతున్నాను అన్నారు.

అల్లు రామలింగయ్య మాట్లాడుతూ...నేను నూరు రోజులు, రెండు వందల రోజులు ఆడిన చిత్రాల్లో నటించాను. తమాషా ఏమిటంటే...నేను నటించని చిత్రాలు కూడా వంద రోజులు ఆడుతున్నాయి అంటూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు. చివరగా చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ చిత్ర విజయానికి ముఖ్య కారకులైన ప్రేక్షక లోకానికి ధన్యవాదాలు అర్పించారు.

గూండా అప్పటి స్టార్ డైరక్టర్ ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొంది విడుదలైన చిత్రం.  ఇందులో చిరంజీవి, రాధ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా రిస్కీ ఫైట్ సీక్వెన్స్ లకు పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా క్లైమాక్ లో ట్రైన్ లో ఫైట్ కు బాగా పేరొచ్చింది. ఎటువంటి బాడీ డబుల్ లేకుండా చిరంజీవి చేసారు. అయితే ఖైది వంటి సక్సెస్ కాలేదు కానీ సూపర్ హిట్ మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాని డాకూ రాజా టైటిల్ తో హిందీలో డబ్ చేసారు.  ఇరవై లక్షల బడ్జెట్ లో ఈ సినిమా రూపొందింది. ప్రముఖ సినీ రచయిత సత్యానంద్ ఈ సినిమాకు కథ, మాటలు అందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios