ఏప్రిల్ 2.. ఇప్పుడు ఈ డేట్ ని బ్లాక్ చేయడానికి చాలా మంది దర్శకనిర్మాతలు ప్లాన్ చేశారు. లిస్ట్ లో చాలా సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి. ఇంకెన్ని యాడ్ అవుతాయో చూడాలి. ముందుగా నాగచైతన్య 'లవ్ స్టోరీ' ఏప్రిల్ 2న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇదే తేదీకి అనుష్క 'నిశ్శబ్దం' రాబోతుంది.

అంతేకాదు.. మైత్రి మూవీ మేకర్స్ వారి 'ఉప్పెన', రానా చేస్తోన్న 'అరణ్య' సినిమాలు కూడా వస్తున్నాయి. ఇలా ఒకే తేదీకి ఈ సినిమాలన్నీ పోటీ పడుతుండడం హాట్ టాపిక్ గా మారింది. ఏప్రిల్ 2న ఎలాంటి పండగలు లేవు. అప్పటికే ఉగాది అయిపోతుంది. అలా అని ఏప్రిల్ 2న పబ్లిక్ హాలిడే లాంటివి కూడా లేవు.

అయినప్పటికీ మేకర్స్ అందరూ ఆ డేట్ పై మక్కువ చూపడానికి కారణం.. వేసవి సెలవులు అటుఇటుగా మొదలయ్యేది అప్పుడే.. అందుకే దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం సినిమాలన్నీ క్యూ కడుతున్నాయి. అందుకే శుక్రవారం కాకుండా ఆ డేట్ గురువారం పడినా.. సినిమాలన్నీ విడుదలకు ఎగబడుతున్నాయి.

నిజానికి ఈ సమ్మర్ లో పెద్ద సినిమాలేవీ లేవు. గత వేసవి బాక్సాఫీస్ పై కనిపించినంత డామినేషన్ ఈసారి కనిపించదు. గతేడాది వేసవికి మహేష్ బాబు 'మహర్షి'తో పాటు 'మజిలీ', 'జెర్సీ', 'చిత్రలహరి' సినిమాలు ఉండడంతో.. ఆ మేరకు కొన్ని సినిమాలు డేట్స్ వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఈసారి మాత్రం అలాంటి పోటీ లేదు.

ఏ తేదీ కావాలంటే ఆ తేదీని ఎన్నుకునే వెసులుబాటు ఉంది. అయినప్పటికీ చాలా మంది మేకర్స్ ఏప్రిల్ 2న రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతానికి లిస్ట్ లో ఉన్న సినిమాల నుండి 'ఉప్పెన', 'నిశ్శబ్ధం', 'అరణ్య' సినిమాల నుండి రిలీజ్ డేట్ పోస్టర్లు వచ్చేశాయి. 'లవ్ స్టోరీ' పోస్టర్ కూడా త్వరలోనే వస్తుందని అంటున్నారు. మొత్తానికి సమ్మర్ ఆరంభంలోనే బాక్సాఫీస్ వద్ద వేడి రాజుకోబోతుందన్నమాట.