ప్రముఖ జానపద గాయకుడు పోతురాజు నర్సయ్య లింగరాజు 66వ యేట బుధవారం కన్నుమూశారు. మాయదారి మైసమ్మ, కోడిపాయె లచ్చమ్మ పాటలతో ఫేమస్. మూడు దశాబ్దాలుగా జానపద ప్రేమికులను ఉర్రూతలూగించిన గేయ రచయిత, గాయకుడు పోతరాజు నర్సయ్యలింగరాజ్‌.. ఆయన్న పీఎన్‌ అని కూడా పిలుచుకుంటారు.

కోడిపాయె లచ్చమ్మది.. కోడి పుంజుపాయె లచ్చమ్మది బాగా ఫేమస్.. ఆ తరువాత వచ్చి మాయదారి మైసమ్మ పాట గురించి చెప్పనక్కరలేదు. ఈ రెండు పాటలతోనే జనసామాన్యానికి బాగా దగ్గరయ్యారు పీఎన్.

బొల్లారం ఆదర్శనగర్‌లో ఉండే లింగరాజ్ స్థానిక మిత్రులతో కలసి డిస్కో రికార్డింగ్‌ కంపెనీ (డీఆర్‌సీ) పేరిట ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1980 నుంచి పాటలు రాసి, పాడుతున్న ఈ బృందం ఆధ్వర్యంలో వందలాది జానపాద గేయాలు ప్రాణం పోసుకున్నాయి.

ఆయా పాటల రచన, గాత్రంలో లింగరాజ్‌ది ప్రత్యేక స్థానం. వెయ్యికి పైగా పాటలు రాసి, పాడిన లింగరాజ్‌కు 1987లో పాడిన ‘మాయదారి మైసమ్మ’పాట జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. అయ్యప్ప భజన పాటలు కూడా రాసి పాడారు. 

ఆదర్శ్‌నగర్‌ బస్తీ కమిటీలో సభ్యుడైన లింగరాజ్‌ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనే వారు. ఆయనకు భార్య ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. బుధవారం ఉదయం మృతి చెందిన లింగరాజ్‌ అంత్యక్రియలు సాయంత్రం ముగిశాయి.