తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగీతం శ్రీనివాసరావు దర్శకుడిగా ఎంతటి గుర్తింపు తెచ్చుకున్నారో తెలిసిందే. ఆయన తెరకెక్కించిన 'పుష్పక విమానం' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ ని అందుకుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అప్పట్లో పెద్ద కథే నడిచిందట.

ఆ విషయాన్ని సింగీతం ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా నీలం కొఠారి అనే ముంబై నటిని అనుకున్నారట. సింగీతం స్వయంగా వెళ్లి ఆమెని చూసి, హీరోయిన్ గా ఓకే చేసుకున్నారట. అయితే ఆమె తనతో పాటు తన హెయిర్ స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ కూడా వస్తారని నీలం చెప్పిందట.

ఇదొక ప్రత్యేకమైన సినిమా అని.. సాధారణ చిత్రమైతే మీరు అడిగినవన్నీ ఇచ్చేవాళ్లమని సింగీతం చెబితే దానికి నీలం ఒప్పుకోలేదట. ఈ క్రమంలో సింగీతం రమేష్ సిప్పీని కలిసారట. అతడేమో.. 'ఒకమ్మాయి ఉంది. చాలా అందంగా ఉంటుంది. ఇప్పటివరకు నాలుగైదు చిత్రాల్లో నటించింది కానీ అవి మధ్యలోనే ఆగిపోయాయి.

ఒకటి కూడా విడుదలకు నోచుకోలేదు. ఒక్క ముక్కలో చెప్పలంటే ఐరన్ లెగ్. మీకు అలాంటి సెంటిమెంట్ లు లేకపోతే వెళ్లి కలవండి. ఆమె పేరు మాధురిదీక్షిత్' అని చెప్పారట. దీంతో ఎలాగోలా ఆమె అడ్రెస్ కనుక్కొని వెళ్లి.. ఆమె పీఏని కలిసి విషయం చెబితే.. అతడేమో మా హీరోయిన్ అలాంటి డైలాగ్ లేని సినిమాలు చేయదని చెప్పేశారట.

ఆ తరువాత సింగీతం శ్రీనివాసరావుకి ఇండియన్ ఎక్స్ ప్రెస్ వాళ్లు సన్మానం చేస్తే.. ఆ ఈవెంట్ కి వచ్చి అమలని చూసి తన సినిమా కోసం అడిగారట. కానీ ఆమె తనకు నటించడం సరిగా రాదని చెప్పారట.

కానీ ఆమె ముఖం నేచురల్ గా ఉండడంతో తన సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నానని సింగీతం అప్పట్లో ఈ విషయాలను చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఒకసారి మాధురీదీక్షిత్ ని కలిసి విషయం చెప్తే.. ఆమె తల బాదుకుంటూ.. 'ఎవడు వాడు మంచి ఛాన్స్ పోగొట్టాడు' అంటూ ఆగ్రహంతో ఊగిపోయారట.