స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం 'అల.. వైకుంఠపురములో'. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. అయితే ఈ సినిమా ఎందుకు చూడాలో ఈ కారణాలు చదివి తెలుసుకోండి.. 

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే సినిమా కోసం అల్లు అర్జున్ ఎంతో కష్టపడ్డాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా ఫ్లాప్ ని బన్నీ భరించలేకపోయాడు. అందుకే చాలా గ్యాప్ తీసుకొని 'అల.. వైకుంఠపురములో' సినిమాలో నటించాడు. దాదాపు ఏడాదిన్నర తరువాత బన్నీ నుండి వస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్, పాటల్లో బన్నీ లుక్ ఆకట్టుకుంటోంది. అతడు స్టైల్ చూడడానికైనా సినిమాకి వెళ్లాలని అనుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. 

 

హీరోలకు ఉండేంత ఫాలోయింగ్ ఉంది మన 'గురూజీ' త్రివిక్రమ్ గారికి. మాటల మాంత్రికుడనే పేరు ఆయనకి ఊరికేం రాలేదు. సినిమా ట్రైలర్ లో ఆడవాళ్లగొప్పదనం గురించి, గొప్ప యుద్ధాలన్నీ ప్రేమించిన వారితోనే అని వినిపించిన డైలాగ్స్ మెప్పించాయి. అలాంటి డైలాగ్స్ సినిమాలో ఇంకెన్ని ఉన్నాయో తెలుసుకోవడానికైనా సినిమాకి వెళ్లాలి. 

అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్ లో గతంలో 'దువ్వాడ జగన్నాథం' అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో బన్నీ, పూజాల కెమిస్ట్రీ బాగా కుదిరింది. అందుకే మరోసారి ఈ జంటని రిపీట్ చేశారు. తన కెరీర్ లో తొలిసారి హీరోయిన్ ని రిపీట్ చేశాడు బన్నీ. వెండితెరపై ఈ జంట ఎలాంటి మ్యాజిక్ రిపీట్ చేయబోతుందో మరి. 

ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబు ఈ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతుంది. దాదాపు పదేళ్ల తరువాత తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది టబు. ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ కీలకంగా ఉండబోతుంది. 

 

ఈ సినిమా ఓ మినీ మల్టీస్టారర్ అనే చెప్పాలి. బన్నీ, పూజాలతో కలిసి సుశాంత్, నవదీప్, నివేదా పెతురాజ్ లాంటి నటులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. వారందరినీ నటనని ఒకే తెరపై చూసే అవకాశం కలుగుతోంది. ఇక సీనియర్ నటులు ఎంతమంది ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.