పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. వేణు శ్రీరామ్ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని ఇటీవల రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హిందీలో ఘనవిజయం సాధించిన పింక్ చిత్రానికి రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కుతోంది. 

అంజలి, నివేత థామస్, ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా వకీల్ షబ్ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ ఈ పాటని విడుదల చేసింది. మగువా.. మగువా అంటూ సాగే ఈ పాట సంగీత ప్రియులని మరో లోకంలోకి తీసుకెళ్లేలా ఉంది. 

ఈ పాట గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సంగీత దర్శకుడు తమన్, లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి, గాయకుడు సిద్ శ్రీరామ్ సృష్టించిన మరో అద్భుతం అని చెప్పొచ్చు. రామజోగయ్య శాస్త్రి తన ప్రతి పదంలోనూ మహిళల గొప్పతనాన్ని అద్భుతంగా వర్ణించారు. ఆ లిరిక్స్ ని తమన్ తన సంగీతంతో, సిద్ శ్రీరామ్ తన గాత్రంతో మరో లెవల్ కు తీసుకుని వెళ్లారు.

సాంగ్ ఆధ్యంతం వినసొంపుగా ఉంటూ మహిళలపై ఎమోషనల్ ఫీలింగ్ కలిగించేలా చేస్తోంది. లిరికల్ వీడియోలో మహిళలకు ఆదర్శంగా నిలిచిన కొందరు గొప్ప మహిళల దృశ్యాలని చూపించారు. అటు ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్న్ రావడం, ఇటు తొలి సాంగ్ కూడా ఆకట్టుకుంటుండడంతో వకీల్ సాబ్ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని ఘనంగా ఆరంభించింది అని చెప్పొచ్చు. 'మగువా.. మగువా' సాంగ్ ని మీరు విని ఆనందించండి..